- అయ్యో.. బిడ్డలారా ! బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి..
 - తల్లితో పాటు ఆమె ఒడిలోనే ప్రాణాలు వదిలిన 40 రోజుల పసికందు
 - పరామర్శకు వెళ్తూ భార్యాభర్తల మృతి.. అనాథలైన ఇద్దరు ఆడపిల్లలు
 - కొడుకు వైద్యం కోసం కోఠి ఈఎన్టీకి వెళ్తూ తండ్రి దుర్మరణం
 - స్వల్ప గాయాలతో బయటపడిన కొడుకు
 - కుటుంబాల్లో విషాదం నింపిన బస్సు ప్రమాదం
 
హైదరాబాద్ సిటీ/ వికారాబాద్, వెలుగు: బస్సు ప్రమాదంలో చనిపోయినోళ్ల కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగాయి. కన్నుమూసిన పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు, తోబుట్టువుల కోసం కుటుంబసభ్యులు.. గుండెలవిసేలా రోదించారు. ఇంకా కండ్ల ముందే మెదులుతున్నారని, వారి జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఇది కలైనా మంచిగుండునని కోరుకున్నారు. ఆ దేవుడికి కనికరం అన్నదే లేదని శాపనార్థాలు పెట్టారు. ఇది తమ జీవితాల్లో చీకటి మిగిల్చిన రోజు అని, ఇక వెలుగు ఎక్కడిదని వెక్కి వెక్కి ఏడ్చారు.
మళ్లీ వస్తనంటివి కదా బేటా..
బిడ్డను బస్సెక్కించేందుకు వచ్చి టాటా చెప్పిన తండ్రికి కొన్ని గంటల్లోనే తన కూతురు మృతి చెందిందని తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. తాండూర్ మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన చాంద్ పాషా స్టోన్ వ్యాపారం చేస్తుంటాడు. మండలంలోని గౌతాపూర్‌లో ఇల్లు కట్టుకుని కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇతడి కూతురు ముస్కాన్(21) హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. 
సెలవులు ఎప్పుడు వచ్చినా, ఆదివారమైనా తప్పకుండా ఇంటికి వచ్చి వెళ్తుంది. అలాగే ఈసారి కూడా వచ్చిన ముస్కాన్.. తల్లిదండ్రులతో ఆనందంగా గడిపింది. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లడానికి తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. తన కూతురిని బస్కెక్కించేందుకు వచ్చిన చాంద్ పాషాఆమెకు టాటా చెప్పాడు. ‘‘పప్పా.. నెక్ట్స్వీకెండ్వస్తా పిక్చేసుకోవడానికి రా..జాగ్రత్తగా వెళ్లు’ అని చెప్పింది. అవ్వే నా బిడ్డ చివరి మాటలయ్యాయి” అని చాంద్‌పాషా కన్నీరుమున్నీరయ్యాడు.
అప్పుడు కాపాడాడు.. ఇప్పుడు ప్రాణాలొదిలాడు 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు (టీజీ 34 టీఏ 6354) తాండూరు నుంచి మొదటి బస్సుగా బయల్దేరింది. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా(45) దీనికి డ్రైవర్. 20 ఏండ్ల కింద పాత తాండూరుకు వలస వచ్చి ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్‌గా పని చేశాడు. పదేండ్లుగా ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం నడిపిన బస్సుకు పది రోజుల క్రితమే డ్రైవర్‌గా చేరాడు. ప్రతి రోజూ ఇదే బస్సు హైదరాబాద్‌కు మొదటి సర్వీసుగా వెళ్తోంది. 
రెండేండ్ల కింద తాండూరు నుంచి వికారాబాద్వెళ్లే బస్సులో కూడా డ్రైవర్‌గా పని చేశాడు. అప్పుడు దస్తగిరి వెళ్తున్న బస్సు.. వికారాబాద్ అనంతగిరి సమీపంలో బ్రేకులు ఫెయిల్అయింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించి ఎత్తు వైపు తీసుకువెళ్లి ఓ చెట్టును స్వల్పంగా ఢీకొట్టి బస్సును ఆపి.. దాదాపు 40 మంది ప్రాణాలు కాపాడాడు. కానీ సోమవారం జరిగిన ప్రమాదంలో అతడు కన్నుమూయగా, మరో 19 మంది ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
దవాఖానకు వెళ్తూ భార్యాభర్తలు..  
యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప, లక్ష్మీ భార్యాభర్తలు. బందెప్ప అన్నకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. అతన్ని చూసేందుకని బందెప్ప, లక్ష్మీ హైదరాబాద్ బయల్దేరారు. ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. వీళ్ల కూతుళ్లు భవానీ, శివలీల ఘటనా స్థలానికి చేరుకుని.. తల్లిదండ్రుల శవాలపై పడి విలపించారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు.  
నన్నూ తీస్కొని పో బిడ్డా..
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన గుర్రాల అఖిల రెడ్డి (23) వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. నాగ్‌పూర్ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. గచ్చిబౌలిలో ఐఐఆర్ఎం కాలేజీలో ఎంబీఏ చేస్తున్నది. ఫస్టియర్మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తి కావడంతో సెలవులపై ఇంటికి వచ్చింది. 
సోమవారం కాలేజీలో స్పోర్స్ మీట్ ఉందని ఇంటి నుంచి బయలుదేరింది. ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లడానికి తాండూరులో బస్సెక్కి ప్రమాదంలో కన్నుమూసింది. బిడ్డ కోసం చేవెళ్ల దవాఖానకు వచ్చిన అఖిల తల్లి హృదయ విదారకంగా రోదించింది. ‘అఖిల.. ఎక్కడికి పోయినవ్బిడ్డా.. ఒక్కసారి కనపడు బిడ్డా.. నన్ను కూడా నీతోని తీస్కపో..’’ అని కన్నీరు పెట్టుకుంది.
తండ్రి.. కూతురు.. మనుమరాలు 
తాండూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన ఖాలీద్ వెల్డర్. ఈయన కూతురు సలేహా(20). కొన్నేళ్ల క్రితం సలేహాను హైదరాబాద్‌లోని షాహిన్నగర్కు చెందిన వాహిద్‌కు ఇచ్చి పెండ్లి చేశారు. ఇటీవల సలేహా కాన్పు కోసం పుట్టింటికి వచ్చి పండంటి పాపకు జన్మనిచ్చింది. 40 రోజుల వయసున్న పాప, సలేహాను ఆమె తండ్రి ఖాలీద్ హైదరాబాద్ లోని అత్తారింట్లో వదిలిపెట్టేందుకు బయలుదేరాడు. బస్సును కంకర టిప్పర్ఢీకొట్టడంతో సలేహ తన కూతురిని కాపాడేందుకు ప్రయత్నం చేసింది. ఏమీ కాకూడదని దగ్గరకు హత్తుకోగా కంకర పడి ఇద్దరూ ఊపిరాడక కన్నుమూశారు. వీరితో పాటు తండ్రి ఖాలీద్కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ముగ్గురు అక్కాచెల్లెళ్లను కబళించిన మృత్యువు
తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ చాలా ఏండ్ల కింద తాండూరు టౌన్‌కు వలస వచ్చారు. ఆయనకు నలుగురు కూతుళ్లు. ఒక కొడుకు ఉన్నారు. ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. ఇటీవల పెద్ద కూతురు అనూష పెండ్లిని ఘనంగా చేశాడు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్నది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్‌లోని కోఠి విమెన్స్కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతురు నందిని అదే కాలేజీలో డిగ్రీ ఫస్టియర్, కొడుకు తాండూరు టౌన్‌లోని ఓ ప్రైవేట్స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గత నెల 15న జరిగిన అక్క అనూష పెండ్లికి తనూష, సాయిప్రియ, నందిని వచ్చారు.
సోమవారం పరీక్షలు ఉండడంతో ముగ్గురూ తాండూరు బస్టాండ్ నుంచి హైదరాబాద్‌వెళ్లే బస్సెక్కారు. బస్సు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారని తెలుసుకున్న ఆ కుటుంబం షాక్‌కు గురైంది. ‘‘కాలేజీ నుంచి మీరు ఇంటికి వస్తే పండుగలా ఉండేది కదరా...మిమ్మల్ని ఎప్పుడూ బిడ్డలనుకోలేదే..కొడుకుల్లా పెంచానే..మీరు లేరంటే ఎట్లా నమ్మాలిరా...ఇంటికి వచ్చి నా చుట్టూ చేరి ముచ్చట్లు పెడితే ఈ లోకంలో ఇంతకన్నా ఆనందం ఏముంటుంది అనుకునేవాడిని. మీరు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నానురా బిడ్డలారా’ అని ఆ తల్లిదండ్రులు రోదిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల అంత్యక్రియలను స్వగ్రామమైన పెర్కంపల్లిలో నిర్వహించగా గ్రామమంతా కదిలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికింది.
కొడుకును హాస్పిటల్‌కు తీసుకెళ్తూ తండ్రి మృతి
కొడుక్కి చెవి సమస్య ఉండడంతో కోఠి ఈఎన్టీ హాస్పిటల్‌కు తీసుకువెళ్తుండగా తండ్రి కన్నుమూశాడు. దౌల్తాబాద్ మండలం నీటూర్‌కు చెందిన హన్మంతుకు భార్య కాశమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పదో తరగతి చదువుతున్న చిన్న కొడుకు అశోక్కుచెవి సమస్య ఉండడంతో పాఠాలు సరిగ్గా వినలేకపోతున్నాడు. దీంతో అతడిని చూపించడానికి కోఠి ఈఎన్టీ హాస్పిటల్‌కు తీసుకువస్తున్నాడు. బస్సులో హన్మంతు పక్కన అశోక్కూర్చున్నాడు. బస్సుమీద టిప్పర్ ఒరగడంతో అశోక్పక్కకు ఎగిరిపడ్డాడు. హన్మంతుపై కంకర పడడంతో కన్నుమూశాడు. ఆశోక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
