జగిత్యాల జిల్లాలో నవంబర్ 3న జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందర్నీ కలిచివేస్తోంది. జేబులో చిల్లి గవ్వలేక అనారోగ్యంతో బాధపడుతోన్న తన తల్లిని.. ఓ కొడుకు తన భుజాన ఎత్తుకుని ఆస్పత్రికి తీసుకెళ్తోన్న ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. అదే సమయానికి అటుగా వెళ్తోన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మానవత్వం చాటుకుని ..తల్లిని ఎత్తుకు వెళ్తున్న ఆ కుమారుడిని చూసి దగ్గరకు వెళ్లి తన కారులో వాళ్లిద్దర్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్ మెంట్ చేయించాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన దీపక్ కొంత కాలంగా నిజామాబాద్ లో లేబర్ గా పనిచేస్తున్నాడు. కూలీ పని చేస్తూ తల్లిని పోషిస్తున్న దీపక్ తల్లి బాలమ్మ(68) ఆరోగ్యం క్షీణించడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించేందుకు నవంబర్ 3న జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉన్నందున తల్లిని తీసుకుని బస్టాండ్ వరకు వచ్చాడు కానీ.. అక్కడి నుంచి ఆస్పత్రి వరకు ఆటో డ్రైవర్ 50 రూపాయలు అడిగాడు. జేబులో చిల్లి గవ్వ లేని దీపక్.. చేసేదేం లేక తన తల్లిని భుజాన వేసుకుని నడవడం మొదలు పెట్టాడు. తల్లి కోసం కొడుకు పడుతున్న ఆ బాధను చూసి అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా ఆగిపోయారు. కొందరి కళ్లు చెమ్మగిల్లాయి.
అదే సమయానికి అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా కారు ఆపారు. తల్లిని కాపాడుకోవాలనుకునే ఆ కొడుకు తపనను చూసి చలించిపోయారు. వెంటనే ఆ తల్లీకొడుకును తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లి.. డాక్టర్లతో మాట్లాడి చికిత్స పూర్తయ్యాక తిరిగి వాళ్లిద్దర్నీ బస్టాండ్ దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయారు సంజయ్.
ఎమ్మెల్యే సంజయ్ ఔదార్యం, కుమారుడికి తల్లిపై ఉన్న ప్రేమ.. రెండూ మానవత్వానికి కొత్త నిర్వచనంగా నిలిచాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తల్లిపై ఉన్న ఆ కొడుకు ప్రేమపై..ఎమ్మెల్యే డాక్డర్ సంజయ్ మానవత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
