సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్‌ దాఖలు.. A-11గా అల్లు అర్జున్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్‌ దాఖలు.. A-11గా అల్లు అర్జున్

హైదరాబాద్: పుష్ప-2 బెన్ ఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్పై అభియోగాలు నమోదు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్ను ఛార్జిషీట్ లో మెన్షన్ చేయడం గమనార్హం. అల్లు అర్జున్తో పాటు మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖలైంది. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై ఛార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 2024, డిసెంబర్ 5న గ్రాండ్‎గా విడుదలైంది. రిలీజ్‎కు ఒకరోజు ముందే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు పలు చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. ఇందులో భాగంగానే ఎంతో చరిత్ర కలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య థియేటర్‎లో కూడా రాత్రి 9.30కి పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‎కు వచ్చాడు. ఇంకేముంది.. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు.

ALSO READ : శివాజీని మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలివే..

ఈ క్రమంలో థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ, ఆమె కుమారుడు అస్వస్థతకు గురి అయ్యారు. తొక్కిసలాట జరగడంతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. వెంటనే వారికి పోలీసులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. మృతురాలిని రేవతి (36)గా పోలీసులు గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.