మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘దృశ్యం’ చిత్రం ఇతర భాషల్లోనూ రీమేక్ రూపంలో సత్తా చాటింది. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘దృశ్యం 2’ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందింది. ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘దృశ్యం3’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని శుక్రవారం ప్రకటించారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 2న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
గత రెండు చిత్రాలను తెరకెక్కించిన జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. దీన్నొక థ్రిల్లర్‌గా కంటే ఫ్యామిలీ డ్రామాగా చూపించబోతున్నామని, గడచిన ఐదేళ్లలో జార్జ్ కుట్టి ఫ్యామిలీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయనేది ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు జీతూ జోసఫ్ చెప్పారు. ఇక జీతూ జోసఫ్ స్క్రిప్ట్‌తోనే అజయ్ దేవగన్ హీరోగా ఇటీవల హిందీలోనూ ‘దృశ్యం 3’ను అనౌన్స్ చేయగా, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
