ఇస్లామాబాద్: రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్కు శాపంగా మారాయి. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులతో విసిగివేసారిపోయిన.. నైపుణ్యం కలిగిన వైద్యులు, ఇంజనీర్లు, అకౌంటంట్లు పాక్ వదిలి ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. గత 24 నెలల్లో.. అంటే రెండేళ్లలో 5 వేల మంది పాక్ వైద్యులు ఆ దేశానికి గుడ్ బై చెప్పేశారు. 11 వేల మంది ఇంజనీర్లు, 13 వేల మంది అకౌంటంట్లు పాకిస్తాన్ వదిలి వెళ్లిపోయారు. కాదు.. కాదు.. పాకిస్తాన్ వాళ్లను చేజార్చుకుంది. మాజీ పాకిస్తానీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోఖర్ ఈ రిపోర్ట్ ను తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రస్తుత దయనీయ స్థితిని ఈ డేటాకు కళ్లకు కట్టింది.
పాక్‌లో పౌర ప్రభుత్వాలను తోలు బొమ్మలను చేసి సైన్యమే పెత్తనం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు, సైనికాధికారులు తమ అహాన్ని పక్కనపెట్టి రాజ్యాంగానికే ఉన్నత స్థానం కట్టబెడితే పరిస్థితులు కొంతవరకు చక్కదిద్దుకునే అవకాశం ఉంది. కనీసం ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పాక్ అరాచకంలోకి, అంతర్యుద్ధంలోకి జారిపోగల ప్రమాదం కనిపిస్తున్నది. పాకిస్తాన్ చరిత్రలో ముగ్గురు ప్రధానమంత్రులు హత్యకు గురయ్యారు. పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్ 1951లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత, జులిఫికర్ అలీ భుట్టో అదేవిధంగా ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో కూడా హత్యకు గురయ్యారు.
►ALSO READ | అమెరికా అల్లకల్లోలం : కాలిఫోర్నియాలో వరదలు.. న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్...
పాకిస్తాన్ సైన్యం చేసిన కుట్రల వల్ల.. చాలా మంది పాకిస్తాన్ ప్రధానమంత్రులు జైలుపాలయ్యారు. ప్రస్తుతం, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ కూడా జైలులో ఉన్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. అతనికి 7 మంది జనరల్స్ సహాయం చేస్తున్నారు. వారు పాకిస్తాన్‌లోని ప్రతి రంగాన్ని, ప్రతి అంశాన్ని నిర్ణయిస్తారు. పాకిస్తాన్ అగ్ర న్యాయమూర్తులను కూడా పాక్ సైన్యం ఆమోదంతోనే నియమిస్తారు.
