అమెరికాలో విపరీతంగా కురుస్తున్న మంచు, వాతావరణం అస్సలు బాలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ సమయంలో ఈ తుఫాను రావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం నాటికి దాదాపు 1,800 విమానాలు రద్దు అయ్యాయి. 22 వేల కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ (JFK, లాగ్వార్డియా, న్యూవార్క్), డెట్రాయిట్, బోస్టన్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
న్యూయార్క్ సహా పరిసర ప్రాంతాలలో దాదాపు 10 అంగుళాల వరకు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విపరీతమైన చలి వల్ల రోడ్లపై మంచు గడ్డకట్టి జారిపోతున్నాయి. దీనివల్ల కార్లలో ప్రయాణించే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. గ్రేట్ లేక్స్ నుండి న్యూ ఇంగ్లాండ్ వరకు ఈ ప్రాంతాల్లో వర్షం, మంచు కురుస్తుండటంతో ప్రయాణాలు దాదాపు ఆగిపోయాయి.
క్రిస్మస్ పండుగ వేళ కాలిఫోర్నియాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. శీతాకాలపు తుఫాను కారణంగా దక్షిణ కాలిఫోర్నియా అస్తవ్యస్తమైంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటివరకు కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీనినే శాస్త్రవేత్తలు 'అట్మాస్ఫియరిక్ రివర్స్' అని పిలుస్తున్నారు. వరద ముప్పు ఎక్కువగా ఉన్న లాస్ ఏంజిల్స్, శాన్ బెర్నార్డినో వంటి ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
