ముత్తారం, వెలుగు : వరకట్నం వేధింపులు తాళలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌లో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పాండవుల స్వామి, భాగ్యలక్ష్మి కుమార్తె అంజలి (21)కి భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లంపల్లికి చెందిన బండి వెంకటేశ్‌తో ఎనిమిది నెలల కింద వివాహమైంది. అంజలి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. వివాహ సమయంలో ఎకరం పొలంతో పాటు రూ. లక్ష కట్నంగా ఇచ్చారు.
అదనపు కట్నం కోసం అత్తమామ, భర్త వేధిస్తుండడంతో అంజలి ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఇంట్లోనే ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబసభ్యులు గమనించగా.. అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్, సీఐ రాజు, ఎస్సై రవికుమార్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
