హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో నింపేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఒక వినూత్న ముందడుగు వేసింది. నగరంలో పేరుకుపోతున్న తడి చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తడి చెత్త డీసెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అంశంపై ఒక భారీ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ నిర్వహించనుంది. కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లను భాగస్వామ్యం చేస్తూ, చెత్తను ఎక్కడికక్కడ ప్రాసెస్ చేసేందుకు ప్రయోగాత్మక ప్రణాళికలను రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జీహెచ్‌ఎంసీ వివిధ రంగాల నిపుణులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా స్టార్టప్‌లు, స్వచ్ఛంద సంస్థలు(NGOs), అంతర్జాతీయ సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకోవచ్చు. గ్రౌండ్ లేవెల్ లో చెత్త సేకరణ, కంపోస్టింగ్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌లో తమకు ఉన్న అనుభవాలను, ఎదురవుతున్న సవాళ్లను ఇక్కడ పంచుకునే అవకాశం కల్పిస్తోంది జీహెచ్ఎంసీ. వార్డు స్థాయిలోనే 'జీరో వేస్ట్' లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో చర్చించటంతో పాటు ఆచరణ సాధ్యమైన ప్లాన్ సిద్ధం చేస్తారు.
♻️ BRAINSTORMING EVENT | Building a Sustainable Hyderabad, Together !!
— GHMC (@GHMCOnline) December 24, 2025
GHMC is organising a Brainstorming Session on Decentralised Wet Waste Management, bringing together NGOs, RWAs, Startups, Sustainability-focused organisations, innovators, and community groups.
The session… pic.twitter.com/1mcP77UFUA
ఈ చర్చా వేదిక ద్వారా సరికొత్త సాంకేతిక పరికరాలు, తక్కువ ఖర్చుతో కూడిన కంపోస్టింగ్ పద్ధతులు, వ్యర్థాల నిర్వహణలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చే వ్యూహాలను నిపుణులు ప్రదర్శిస్తారు. ఇక్కడ వచ్చిన బెస్ట్ ఐడియాలను జీహెచ్‌ఎంసీ పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టి, దీర్ఘకాలిక వ్యర్థాల తగ్గింపు చర్యల్లో భాగంగా మారుస్తుంది. విశేషమేమిటంటే.. ఈ కార్యక్రమాన్ని కూడా 'జీరో వేస్ట్ ఈవెంట్'గా నిర్వహించటమే. అంటే ఈ కార్యక్రమంలో ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.
ALSO READ :: తెలంగాణ RTCలో భారీగా ఉద్యోగాలు..
రిజిస్ట్రేషన్ వివరాలు:
ఆసక్తి గల ఔత్సాహికులు, సంస్థలు ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు 2025, డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 29 లోపు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఈవెంట్ వివరాలను తెలియజేస్తారు. పాలసీ మేకింగ్, టెక్నాలజీ, సామాజిక భాగస్వామ్యం అనే మూడు ప్రధాన అంశాలపై ఈ సదస్సు కార్యాచరణను రూపొందించనుంది. భాగ్యనగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడంలో బాగం కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు.
మీ పేరును ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి.. ఫారం లింక్
