వేములవాడ, వెలుగు: ఎములాడలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకొని.. స్వామివారి దర్శనం చేయిస్తామని భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏడుగురు దళారులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి తెలిపారు. శుక్రవారం తన ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం సమ్మక్క జాతర నేపథ్యంలో వేములవాడలోని భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగిందన్నారు.
దీంతో క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా త్వరగా స్వామివారి దర్శనం చేయిస్తామంటూ కొంతమంది దళారులు దందా చేస్తున్నారని, భక్తుల వద్ద రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
భక్తులు ప్రైవేట్ వ్యక్తులను నమ్మవద్దని, ఆలయ కౌంటర్లో మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. రాజన్న ఆలయ పరిసరాలతోపాటు వేములవాడకు వచ్చే అన్ని దారుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, భక్తుల భద్రతపై నిఘా పెట్టామని తెలిపారు. స్వామివారి దర్శనం పేరిట డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టౌన్సీఐ వీరప్రసాద్ఉన్నారు.
