Nagababu: ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడటానికి మీరెవరు? శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్!

Nagababu: ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడటానికి మీరెవరు? శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్!

హీరోయిన్స్ వస్త్రాధారణపై ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు అత్యంత ఘాటుగా స్పందించారు. కేవలం ఒక నటుడిగానే కాకుండా, బాధ్యతాయుతమైన పౌరుడిగా  మాట్లాడుతున్నానని చెప్పారు.  ప్రతి వ్యక్తికీ తనకిష్టమైన రీతిలో జీవించే హక్కు ఉందన్నారు. వ్యక్తిగత గౌరవం, గోప్యత. వీటిని కాలరాయడం నేరమని, మహిళల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.  సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

శివాజీ టార్గెట్ కాదు..

నాగబాబు తన వీడియోలో స్పష్టతనిస్తూ.. నేను శివాజీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. కానీ మన సమాజంలో వేళ్లూనుకుపోయిన 'మోరల్ పోలీసింగ్' అనే సామాజిక రుగ్మతపై మాట్లాడుతున్నాను అని పేర్కొన్నారు. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏం ధరించాలి అని శాసించే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇది పురుషాధిక్య అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికీ తనకిష్టమైన రీతిలో జీవించే హక్కు ఉందని నాగబాబు గుర్తుచేశారు.ఆడవాళ్లు ఇలాంటి డ్రెస్ లు మాత్రమే వేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది. ప్రతి ఆడపిల్లకు ఆత్మగౌరవం ఉంటుంది.  మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు కూడా ఉంటుంది అని అన్నారు.

అత్యాచారాలకు కారణం మగవాడి క్రూరత్వం!

చాలా మంది అత్యాచారాలకు మహిళల వస్త్రాధారణే కారణమని కుంటి సాకులు చెబుతుంటారు. దీనిపై నాగబాబు కౌంటర్ ఇస్తూ.. మహిళలపై జరుగుతున్న దాడులకు వారి దుస్తులు కారణం కాదు, మగవారిలోని రాక్షసత్వమే కారణం. అజంతా శిల్పాలను ఎప్పుడైనా చూశారా? సంస్కృతిని బట్టి ఫ్యాషన్ మారుతుంటుంది. ఏఐ (AI) యుగంలోకి వెళ్తున్నా మగవాడి మనస్తత్వం మారకపోవడం దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోండి..

వ్యవస్థలు మిమ్మల్ని రక్షించే స్థితిలో లేవు, కాబట్టి మహిళలు స్వయంగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని నాగబాబు సూచించారు. మీ వస్త్రాధారణ గురించి ఎవరైనా అహంకారంతో మాట్లాడితే, బయటకు వచ్చి గట్టిగా ఖండించాలన్నారు. మగవారి అహంకారపూరిత మాటలకు మద్దతు ఇచ్చే మహిళలు కూడా తమ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి. బాధితులకు అండగా నిలవాలని కోరారు..

మార్పు మన నుండే మొదలవ్వాలి..

ఒకప్పుడు నేను కూడా సంప్రదాయవాదిలా ఆలోచించేవాడిని, కానీ ప్రపంచాన్ని చూశాక ఆ అజ్ఞానం నుండి బయటకు వచ్చాను అని నాగబాబు చెప్పారు. ప్రతి ఆడపిల్లనూ మన కుటుంబ సభ్యురాలిలా చూడాలని, ఆమె ఆత్మగౌరవాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. మహిళలకు తనలాంటి వారు ఎప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎవరైనా మిమ్మల్ని కించపరిస్తే చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పండి అంటూ నాగబాబు సూచించారు.