తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ, వైకుంఠ ద్వారా దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఉత్తర ద్వార దర్శనానికి క్యూ లైన్లలో అన్ని పనులు దాదాపు పూర్తి చేసినట్లు వివరించారు. క్యూలైన్ లో భక్తులు కూర్చొని వేచి ఉండేలా ఏర్పాట్లు చేశామని... భక్తుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా అదనంగా 4 బ్లాకుల టాయిలెట్లను నిర్మిస్తున్నామన్నారు. ఇవి డిసెంబర్ 30వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 10 నుండి 15 మొబైల్ వాటర్ సప్లైను ఏర్పాటు చేశామని..3 మొబైల్ ఫుడ్ వ్యాన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 63వ గేటు వరకు అన్నప్రసాదం అందించే కౌంటర్లు.. చలికాలం దృష్ట్యా భక్తులకు వేడివేడి అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడకుండా .. నీరు, టాయిలెట్లు, ఫుడ్ కౌంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలిపేలా అన్ని భాషలలో సైనేజ్ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి .
