- కేంద్ర వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాల కన్నెర్ర
వెలుగు, నెట్వర్క్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు కన్నెర్రజేశాయి. ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగాభారీ ర్యాలీలు నిర్వహించాయి. సంగారెడ్డిలో కార్మిక నేత చుక్కా రాములు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతోనైనా మోదీ ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర వ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి కార్మికులంతా ఏకం కావాలన్నారు. పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఐలా ఆఫీస్వద్ద బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఐటీయూ ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున్న ధర్నా నిర్వహించారు.
కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. మెదక్‌జిల్లా తూప్రాన్‌లో సీఐటీయూ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో ఆఫీసులో అందజేశారు. కౌడిపల్లిలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ఆధ్వర్యంలో సమ్మె చేశారు. తహసీల్దార్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వద్దకు ర్యాలీ నిర్వహించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయడం సరికాదన్నారు.
శివ్వంపేటలో తూప్రాన్- నర్సాపూర్ హైవే పై కార్మికులు రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారులకు పోలీసులు నచ్చచెప్పి రాస్తారోకో విరమింపచేశారు. సిద్దిపేట జిల్లా తొగుటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు తహసీల్దార్ఆఫీస్ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
