- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. క్రీడలతో ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చునని, మానసికోల్లాసంతో పాటు, దేహదారుఢ్యం సమకూరుతుందని చెప్పారు. గోపాల్పేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సీఎం క్రికెట్ క్రీడా పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రవ్యాప్తంగా క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని, క్రీడాకారులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని గొప్ప క్రీడాకారులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు.
అనంతరం మండల కేంద్రంలోని బాయ్స్ హై స్కూలులో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సన్నబియ్యంతో వండిన అన్నంతో పాటు, పప్పు కూరగాయలను, రాగిజావను చెక్ చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల టీచర్లు, విద్యార్థులు, కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.
