అచ్చంపేట లో ‘ఆక్వా హబ్’ : రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

అచ్చంపేట లో ‘ఆక్వా హబ్’ : రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
  •     రూ. 50 కోట్లతో అభివృద్ధి
  •     100 ఎకరాల్లో ఆక్వా కల్చర్ ప్రాజెక్టు.. 
  •     పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి   

అచ్చంపేట, వెలుగు : రాష్ట్రంలో మత్స్య పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ అచ్చంపేట ప్రాంతంలో రూ. 50 కోట్లతో 100 ఎకరాల్లో ఆక్వా కల్చర్ ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి చంద్రసాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. మంత్రికి ముదిరాజులు తమ సంప్రదాయ వలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రసాగర్ కేంద్రాన్ని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్ది, ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లలను పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 

గతేడాది రూ. 123 కోట్లతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశామని, ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఇక్కడే ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అచ్చంపేటలో ముదిరాజ్ భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ మినీ స్టేడియం అభివృద్ధికి రూ. 2 కోట్లు కేటాయించడంతో పాటు విజయ డెయిరీ సామర్థ్యాన్ని 30 వేల లీటర్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో మొదటిసారి కులగణన చేపట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 

ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూపులోకి చేర్చేందుకు కృషి చేస్తున్నామని, అణగారిన వర్గాల అభివృద్ధి కేవలం విద్యతోనే సాధ్యమని హితవు పలికారు. ప్రతి గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా విగ్రహాలను ఉచితంగా అందజేస్తానని ప్రకటించారు. అనంతరం అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్​పర్సన్​ రాజేందర్, మార్కెట్ చైర్​ పర్సన్ రజిత మల్లేశ్, వైస్ చైర్మన్ వెంకటయ్య ముదిరాజ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజన్, నేతలు నరసింహ, మల్లేశ్, పర్వతాలు, బాలరాజు, కిషోర్, వెంకటయ్య, శ్రీశైలం  పాల్గొన్నారు.