ఏపీ, తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పై జోరుగా బెట్టింగ్స్!..

ఏపీ, తెలంగాణలో  జూబ్లీహిల్స్ బైపోల్ పై జోరుగా  బెట్టింగ్స్!..

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ గెలుపోటములపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగులతో సమానంగా సాగుతుండటం గమనార్హం. గెలుపు, ఓటములతోపాటు అభ్యర్థి సాధించే మెజార్టీపైనా, సెకండ్ ప్లేస్ పై కూడా పందెం రాయులు బెట్టింగులు కాస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది ఓటర్లున్నా అందులో 50 శాతం మందే అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నారు.

 2009లో 52.76% 2014లో 50.18%, 2018లో 45.59 %, 2023లో 47.49% ఓట్లు పోలవడమే తాము ఇలా విశ్లేషించడానికి కారణమని చెబుతున్నారు. అంటే మొత్తం ఓట్లలో 30 శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది. ఏడు డివిజన్లు ఉన్న ‘హిల్స్‌’ను గుప్పెట పట్టేందుకు పార్టీలు బలగాలను మోహరించాయి. ఏ ఓటరు ఎక్కడున్నారు.. ప్రత్యర్థి ప్రాంతాలు ఏవి.. ఏ సంఘాన్ని మచ్చిక చేసుకుంటే ఓట్లు మళ్లుతాయనే వ్యూహాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నిక అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. బీజేపీ కూడా ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేయించుకుంటోంది. 

విజయం తమదేనని ప్రచారం చేసుకుంటోంది. దీంతో మరో వైపు సర్వే సంస్థల పంట పండుతోంది. ఇదే క్రమంలో సర్వేలను చూస్తున్న బెట్టింగ్ రాయుళ్లు బుకీలను ఆశ్రయిస్తున్నారు. కూకట్ పల్లి కేంద్రంగా ఈ బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది. ముందుగా అడ్వాన్సులు తీసుకొని ఈ దందాకు దిగుతున్నారు. కొందరు పొలాలు కూడా రాయించుకుంటున్నారని సమాచారం. మూడు అంశాలపైనే ప్రధానంగా బెట్టింగ్ సాగుతోందని తెలుస్తోంది. గెలుపు ఓటములపై , రెండోది విజేత పది వేల కన్నా ఎక్కువ మెజార్టీ సాధిస్తాడా..? తక్కువ మెజార్టీ సాధిస్తాడా..? అన్నదానిపై మూడోది రెండో ప్లేస్ ఎవరికి వస్తుందనే దానిపైనే బెట్టింగులు ఉంటున్నాయి. సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటుందని కూడా కొందరు బెట్టింగులు కాస్తున్నారు. కొందరు బీజేపీకి డిపాజిట్ రాదని కూడా పందేలు కాస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ చానల్స్, ప్రత్యేక యాప్ ల ద్వారా ఈ బెట్టింగ్ దందా కొనసాగుతోంది. బెట్టింగుల మూలంగా ఎంతో మంది వీధిన  పడ్డా.. ఆత్మహత్యలు చేసుకున్నా.. ఈ దందా మాత్ర ఆగడం లేదు.