సెర్బియన్ సూపర్ లీగ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాడ్నిచ్కి టీమ్ హెడ్ కోచ్ మ్లాడెన్ జిజోవిక్ (44) గుండెపోటుతో మరణించాడు. రాడ్నిచ్కి, మ్లాడోస్ట్ లుకానీ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోన్న సమయంలో ఆయన ఒక్కసారిగా గ్రౌండ్లో కుప్పకూలిపోయాడు. వైద్య సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. జిజోవిక్ ఆకస్మిక మరణంతో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన తర్వాత మ్యాచ్‌ను నిలిపివేశారు. కోచ్ మరణంతో రాడ్నిచ్కి టీమ్ ఆటగాళ్లు గ్రౌండ్‌లోనే కన్నీరుమున్నీరుగా విలపించారు.
జిజోవిక్ ఆకస్మిక మరణంపై సెర్బియన్ ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాడ్నిచ్కి, మ్లాడోస్ట్ లుకానీ జట్ల మధ్య మ్యాచ్ 22వ నిమిషంలో కోచ్ జిజోవిక్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని తెలిపింది. వైద్య సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడని వెల్లడించింది.
జిజోవిక్ మరణం సెర్బియన్ ఫుట్‌బాల్‌కు భారీ నష్టమని సెర్బియన్ ఫుట్‌బాల్ సమాఖ్య పేర్కొంది. హెడ్ కోచ్ జిజోవిక్ అకాల మరణంపై రాడ్నిచ్కి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అతను ఒక గౌరవనీయమైన వ్యక్తి అని కొనియాడింది. గ్రౌండ్లో, గ్రౌండ్ బయట జిజోవిక్ ఆదర్శప్రాయమైన వ్యక్తి అని అభివర్ణించారు.
జిజోవిక్ నేపథ్యం:
1980, డిసెంబర్ 27న మ్లాడెన్ జిజోవిక్ రొగాటికాలో జన్మించాడు. అతను మ్లాడోస్ట్ రొగాటికాతో తన ఫుట్‌బాల్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కెరీర్ మొత్తంలో జిజోవిక్ మిడ్‌ఫీల్డర్‌గా ఆడాడు. రాడ్నిక్ బిజెల్జినా, రుడార్ ఉగ్ల్జెవిక్, జ్రింజ్‌స్కీ మోస్టర్ (రెండుసార్లు), KF టిరానా, బోరాక్ బంజా లుకాకు తరుఫున ప్రాతినిధ్యం వహించాడు.
2016లో రాడ్నిక్ బిజెల్జినాలో ఆటకు గుడ్ బై చెప్పాడు. 2017లో కోచ్ అవతారమెత్తాడు. రాడ్నిక్ బిజెల్జినా, జ్రింజ్‌స్కీ మోస్టార్, స్లోబోడా తుజ్లా, బోరాక్ బంజా లుకా, సౌదీ అరేబియాలోని అల్-ఖోలూద్ జట్లకు కోచ్‌గా పని చేశాడు.
