పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా మరోసారి కర్ణాకట కోర్టు మెట్లెక్కాడు. బ్యాంకులు తననుంచి, తన కంపెనీ నుంచి వడ్డీలమీద వడ్డీలు వసూలు చేస్తున్నాయని... చెల్లించిన మొత్తాలపై వడ్డీ వసూలు చేయడాన్ని నిలిపివేసేలా బ్యాంకులను ఆదేశించాలని కర్ణాటక హైకోర్టును కోరారు. బ్యాంకులు ఇప్పటికే చెల్లించాల్సిన దానికంటే చాలా ఎక్కువ పొందాయి.. తిరిగి వాటిపై కూడా వడ్డీని విధిస్తున్నాయని మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పువయ్య వాదించారు. డబ్బు అందలేదని, ఇంకా డబ్బు చెల్లించాల్సి ఉందని బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు.
మాల్యానుంచి, అతని ఎయిర్ లైన్స్ సంస్థ కింగ్ ఫిషర్ నుంచి ఇప్పటివరకు వసూలు చేసిన అప్పులు, వాటి వడ్డీకి సంబంధించిన పూర్తి డిటెయిల్స్‌తో బ్యాంకులు ప్రకటన విడుదల చేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాల్యా తరపు న్యాయవాది సాజన్ పూవయ్య.
డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) జారీ చేసిన రుణ రికవరీ సర్టిఫికేట్ ప్రకారం..11.5 శాతం వడ్డీతో రూ. 6వేల203 కోట్లు చూపిస్తుంది.. కానీ ఇప్పటివరకు రికవరీలు రూ. 10వేల కోట్లు దాటాయని పూవయ్య కోర్టుకు తెలిపారు. బ్యాంకులు ఇప్పటికే పూర్తి మొత్తాన్ని వసూలు చేశాయని ధృవీకరిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలతో సహా పత్రికా ప్రకటనలు ,అధికారిక రిపోర్టులను పూవయ్య కోర్టుకు తెలిపారు. బ్యాంకులు మొత్తాలను తిరిగి పొందాయి.. వడ్డీ పెరగడం ఏంటని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఈ కేసు విచారణను నవంబర్ 12కు వాయిదా వేసింది.
