భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగి, చివరకు ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ పరిణామాలు.. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల వల్ల మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో సూచీలు భారీగా పతనమైనప్పటికీ, కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో రికవరీ సాధించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కీలక సపోర్ట్ స్థాయిలను కాపాడుకుంటూ మార్కెట్ వర్గాల్లో ధీమాను నింపింది. దీంతో చాలా మంది క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేట్ల వద్ద కొనేందుకు ఆసక్తి కనబరిచారు.
ఈరోజు మార్కెట్ల ర్యాలీకి ప్రధానంగా కొన్ని కీలక కారణాలు తోడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా మారింది. అలాగే హార్ముజ్ జలసంధి గుండా భారత ఇంధన నౌకలు సురక్షితంగా చేరుతున్నాయన్న వార్తలు ఎనర్జీ స్టాక్స్ లో జోష్ నింపాయి. దీనికి తోడు ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో పతనం వద్ద భారీగా కొనుగోళ్లు జరగడం సూచీలు పుంజుకోవడానికి సహాయపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు తగ్గించి, దేశీయ ఇన్వెస్టర్లు అండగా నిలవడం మార్కెట్‌ను నిలబెట్టింది.
►ALSO READ | గుజరాత్ వచ్చిన నందా దేవి LPG నౌక : 40 లక్షల సిలిండర్లకు గ్యాస్
రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి హెవీవెయిట్ షేర్లు రాణించడం వల్ల నిఫ్టీ కీలకమైన 22,000 మార్కు పైన ముగియగలిగింది. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, భారత ఆర్థిక మూలాలు బలంగా ఉండటం ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్ల గమనం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులపై మార్కెట్ కన్ను ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
