గత ఏడాది స్టాన్‌ఫోర్డ్‌లో వచ్చిన AI టౌన్ లాగే, ఇప్పుడు చైనా పరిశోధకులు కూడా ఒక AI హాస్పిటల్ టౌన్ తయారు చేశారు. దీనికి "ఏజెంట్ హాస్పిటల్" అని పేరు పెట్టారు. దీన్ని సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ AI ఆసుపత్రిలో వర్చువల్ రోగులకు AI డాక్టర్లు చికిత్స చేస్తారు. ఈ AI డాక్టర్లు, నర్సులు, రోగులు అందరూ large language model (LLM)తో నడిచే స్వయంప్రతిపత్తి గల ఏజెంట్లు అంటే వాటంతట అవే పనిచేసుకునేవి. ఈ AI డాక్టర్లు కేవలం కొన్ని రోజుల్లోనే 10వేల మంది రోగులకు చికిత్స చేయగలరు. అదే పని మానవ డాక్టర్లకు రెండు సంవత్సరాలు పట్టొచ్చు.
AI డాక్టర్లు MedQA డేటాసెట్‌లో 93.06% కచ్చితత్వాన్ని సాధించారు. రోగ నిర్ధారణ (Diagnosis) నుండి చికిత్స వరకు మొత్తం ప్రక్రియను ఫాలో అవుతున్నారు. ఏజెంట్ హాస్పిటల్లో  14 మంది డాక్టర్ ఏజెంట్లు, 4 మంది నర్సింగ్ ఏజెంట్లు ఉన్నారు. ఈ సెటప్ ద్వారా వైద్య విద్యార్థులకు ప్రమాదం లేని వాతావరణంలో చికిత్స ప్రణాళికలు చెప్పే అవకాశం దొరుకుతుంది ఇంకా ఆసుపత్రి పనులను మెరుగుపరచవచ్చు.
 
ప్రాజెక్ట్ లీడర్ లియు యాంగ్ ప్రకారం, ఈ AI ఆవిష్కరణ ఆరోగ్య సంరక్షణలో పెద్ద మార్పు తీసుకురాగలదు. ఈ AI ఆసుపత్రి ద్వారా అందరికీ నాణ్యమైన, చవకైన, సులభంగా దొరికే ఆరోగ్య సేవలను అందించవచ్చు. ఇది అంటువ్యాధులు వంటి క్లిష్టమైన వైద్య పరిస్థితులను అనుకరించగలదు అలాగే అంచనా వేయగలదు.
దీని వల్ల అద్భుతమైన అవకాశాలు ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేంటంటే నిబంధనలు పాటించడం అంటే జాతీయ వైద్య నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇంకా AI, మానవ వైద్యుల మధ్య సరైన సహకారం ఉండాలి. సింఘువా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డాంగ్ జియాహోంగ్ చెప్పినట్లు, AI కచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచగలిగినా మానవ డాక్టర్లు ఇచ్చే వ్యక్తిగత శ్రద్ధ, చూపెట్టే ప్రేమని ఈ AI హాస్పిటల్ భర్తీ చేయలేదు.
