పెద్దపల్లి జిల్లాలో డోర్ లాక్ అయి.. కారులో చిక్కుకున్న చిన్నారి.. వీడియో చూపించి కాపాడారు !

పెద్దపల్లి జిల్లాలో డోర్ లాక్ అయి.. కారులో చిక్కుకున్న చిన్నారి.. వీడియో చూపించి కాపాడారు !

పెద్దపల్లి జిల్లా: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయిపోవడంతో ఊపిరాడక చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి వినే ఉంటారు. కానీ.. ఈ ఘటనలో ఒక యువకుడి సమయస్పూర్తి ఒక చిన్నారిని కాపాడింది. సుల్తానాబాద్‌లోని ఒక స్వీట్ షాప్ దగ్గర ఒక కుటుంబం కారు కీస్‌ను లోపల వదిలేయడం వల్ల, కారులోనే ఒక చిన్నారి చిక్కుకుపోయింది. డోర్ లాక్ కావడంతో చిన్నారి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో డోర్ ఎలా తెరవాలో ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన చిన్నారి తెలివిగా డోర్ తెరిచి క్షేమంగా బయటపడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని కాపాడిన ఆ యువకుడిని స్థానికులు అభినందించారు.

కారు డోర్ అయి చిన్నారులు చనిపోయిన ఘటనలు ఇటీవల కూడా తెలంగాణలో వెలుగుచూశాయి. 2025, ఏప్రిల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరిగిద్దలో ఇలాంటి ఘటనే జరిగింది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారులు ఇద్దరు.. తన్మయశ్రీ(5), అభినయ శ్రీ(4)  కారు లోపల ఆడుకుంటుండగా డోర్ లాక్ పడింది. చిన్నారులు కనిపించడం లేదని వెతుకుతున్న తల్లిదండ్రులు వెళ్లి చూసే సరికి కారులో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే తల్లిదండ్రులు చిన్నారులిద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  చిన్నారులిద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.