ప్రతిపక్షాలవి పనికిమాలిన విమర్శలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ప్రతిపక్షాలవి పనికిమాలిన విమర్శలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

చొప్పదండి, వెలుగు: పనికిమాలిన విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మెట్ట నియోజకవర్గమైన చొప్పదండికి సాగునీటి వసతులు, కాలేజీ ఏర్పాటు పనులు సీఎం చేతుల మీదుగా జరగనున్నాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సీఎం రేవంత్ రెడ్డి రహదారులు, విద్య, వైద్య రంగాల్లో పట్టుదలతో అభివృద్ధి  చేస్తున్నారని అన్నారు. పంచాయతీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయయాత్ర కొనసాగుతోందని, అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గురువారం సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

గత బీఆర్ఎస్ పాలనలో సాగునీటి పనులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, వెలిచాల రాజేందర్ రావు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, కొత్తూరు మహేశ్, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.