ఇండియా కూటమి భారీ స్కెచ్.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచ్చి శివ..!

ఇండియా కూటమి భారీ స్కెచ్.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచ్చి శివ..!

న్యూఢిల్లీ: బీజేపీ ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించడంతో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కాక మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును అనౌన్స్ చేయడంతో.. ప్రతిపక్ష ఇండియా కూటమి క్యాండిడేట్ సెలక్షన్‎పై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివను బరిలోకి దింపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‎పై అదే రాష్ట్రానికి చెందిన సీనియర్ పొలిటిషియన్ తిరుచ్చి శివను పోటీ చేయించాలని ఇండియా కూటమి పరిశీలిస్తోన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

శివను అభ్యర్థిగా ఎంచుకోవడం వల్ల ప్రతిపక్షాలు ప్రాంతీయ రాజకీయాల చిక్కులను అధిగమించడంలో కూడా సహాయపడుతుందని ఇండియా కూటమి భావిస్తోంది. అయితే, ఈ నిర్ణయాన్ని ఇండియా కూటమిలో కీలకమైన తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రాజకీయేతర వ్యక్తిని పోటీకి నిలపాలని టీఎంసీ వాదిస్తోంది. ఈ కారణంతోనే గత ఉప రాష్ట్రపతి ఎన్నికకు కూడా టీఎంసీ దూరంగా ఉంది. గత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జగదీప్ ధన్‎ఖడ్‎ను బరిలోకి దింపగా.. ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ అల్వాను పోటీ చేయించింది. 

ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‎ఖడ్ విజయం సాధించారు. ఇప్పుడు ఇండియా కూటమి పోటీకి దించాలని యోచిస్తోన్న తిరుచ్చి శివ కూడా రాజకీయాలకు (డీఎంకే పార్టీ) చెందిన వ్యక్తి కావడంతో టీఎంసీ ఈ సారి కూడా ఇండియా కూటమికి మద్దతు ఇవ్వకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని ఇండియా కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటంతో టీఎంసీ అంశాన్ని ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు మరికొందరు. 

మరోవైపు ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులే ఉప రాష్ట్రపతి రేసులో ఉంటే ఇండియా కూటమిలోని డీఎంకే పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశం కూడా చర్చకు దారి  తీసింది. దీనిపై డీఎంకే అధికార ప్రతినిధి TKS ఎలంగోవన్ క్లారిటీ ఇచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో డీఎంకే పార్టీ ఇండియా కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. బీజేపీ తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‎ను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించడం పొలిటికల్ స్టంట్ అని ఆయన అభివర్ణించారు. మరోవైపు అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు సోమవారం (ఆగస్ట్ 18) ఇండియా కూటమి వర్చువల్‎గా సమావేశ కానుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.