
- వచ్చే నెల నుంచి అందజేయనున్న ప్రభుత్వం
- బ్యాగులపై సంక్షేమ పథకాల వివరాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి మళ్లీ రేషన్ పంపిణీ ప్రారంభమవుతున్నది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఫ్రీగా బ్యాగులు అందజేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బ్యాగుల్లో సన్న బియ్యంతో పాటు దానిపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు ప్రింట్ అయి ఉంటాయి. 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి అందజేయడంతో ఆగస్టు వరకు సరాఫరా ఆగిపోయింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు బ్యాగులు చేరినట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. ఈ బ్యాగు ధర బయట రూ.50 వరకు ఉంటుందని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలతో పాటు ‘ఇందిరమ్మ అభయహస్తం’ పేరుతో రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల వివరాలు ప్రింట్ అయి ఉంటాయి. రేషన్ అయిపోయాక అవే బ్యాగులను ఇతర సరుకులు, కూరగాయలు, కిరాణా సామాన్లు తెచ్చుకునేందుకు వీలుగా క్వాలిటీతో ఉండనున్నాయి..