
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన భార్య రుక్మిణి కూడా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ (సోమవారం, ఆగస్ట్ 18, 2025) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లో ఇప్పటికే ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను భర్త మరణం మరింత కుంగదీసింది. జులై 13, 2025న కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో చనిపోయారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ ఏరియాలో కోట శ్రీనివాస రావు నివాసం ఉంది.
కోట శ్రీనివాస రావు, రుక్మిణి దంపతులకు ముగ్గురు సంతానం. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. శోచనీయం ఏంటంటే.. కోట శ్రీనివాసరావు దంపతులకు పుత్ర శోకం వాళ్లు బతికి ఉన్నంత కాలం ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది. 2010 జూన్ 10న కోట శ్రీనివాసరావు కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ బాధతో కోట శ్రీనివాసరావు, ఆయన భార్య రుక్మిణి ఏళ్ల తరబడి కుమిలిపోయారు.
కోట శ్రీనివాసరావును జీవిత చరమాంకంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టాయి. ఆయన తన 83వ పుట్టినరోజు జరిగిన మూడు రోజులకే ప్రాణాలు కోల్పోవడం.. ఇండస్ట్రీలోని ఆయన సన్నిహితులను, కోట నటనను అభిమానించే సినీ ప్రేక్షకులను శోక సంద్రంలోకి నెట్టేసింది. కోట భార్య రుక్మిణి గృహిణిగానే ఉన్నారు తప్ప సినీ పరిశ్రమ ఛాయలు కూడా ఆమెపై పడలేదు. భర్త ప్రొఫెషనల్ లైఫ్కు ఏనాడు ఆమె అడ్డంకి కాలేదు.
కోట శ్రీనివాసరావు షూటింగ్స్లో రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉన్న రోజుల్లో కూడా.. పిల్లల యోగక్షేమాలు చూసుకుంటూ భర్తకు బలం గానే ఉంది తప్ప ఆమె ఎప్పుడూ కోటకు బలహీనతగా మారలేదు. అందుకే అన్ని ఏళ్ల పాటు వారి వైవాహిక బంధం అరమరికలు లేకుండా సాఫీగా సాగిపోయింది. జీవిత భాగస్వామి ఈ లోకాన్ని వీడిన రోజుల వ్యవధిలోనే కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి కూడా కాలం చేశారు.