
- రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి శ్రీకారం
- 21న జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక
భద్రాద్రికొత్తగూడెం/చంద్రుగొండ, వెలుగు: నిన్న మొన్నటి వరకు ఆ ఊరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ గ్రామం పేరు రాష్ట్రస్థాయిలో మారు మోగనుంది. ఆ ఊరు పేరే బెండాలపాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్రంలోనే మొదటిసారి భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీతో పాటు పలు శాఖల ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు..
భద్రాద్రి జిల్లాకు మొదటి దశలో 13,799 ఇండ్లు మంజూరవగా, 6,050 ఇండ్లకు మార్కింగ్ ఇచ్చారు. బేస్మెంట్ లెవెల్లో 2,114 ఇండ్లు, రూఫ్ లెవెల్లో 444, స్లాబ్ లెవెల్లో 160 ఇండ్లు ఉన్నాయి.
ఇక నుంచి గుడిసెలు లేని గ్రామంగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీంతో బెండాలపాడు ఇక నుంచి గుడిసెలు లేని గ్రామంగా మారనుంది. చండ్రుగొండ మండలం బెండాల పాడు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. గ్రామంలో అర్హులైన పేద, మధ్య తరగతి ప్రజలందరికీ ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసింది. గ్రామంలో 2,300 జనాభా ఉండగా, 445 ఇండ్లు ఉన్నాయి. ఇందులో 247 ఫ్యామిలీలు గుడిసెల్లోనే ఉండేవారు. గుడిసెలతో పాటు పూర్తిగా శిథిలమైన ఇండ్లను గుర్తించారు. 312 మందిని సెలెక్ట్ చేశారు.
ప్రభుత్వం 310 ఇండ్లను మంజూరుచేసింది. టెక్నికల్ ప్రాబ్లంతో రెండు ఇండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కూడా త్వరలో మంజూరు చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులో దాదాపు 50 ఇండ్ల వరకు స్లాబ్ లెవెల్‌కు చేరాయి. 78 ఇండ్లు లెంటల్ లెవెల్లో, 147 ఇండ్లు బేస్ మెంట్ లెవెల్లో ఉన్నాయి. సీఎం వచ్చే నాటికి 20 నుంచి 25 ఇండ్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేలా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు హౌసింగ్, రెవెన్యూ, ఎంపీడీవో నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
30 ఏండ్లుగా గుడిసెలోనే..
ముప్పై ఏండ్లుగా గుడిసెలోనే ఉంటున్న. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నం. జీవితంలో సొంతిల్లు కట్టుకుంటానని ఊహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డికి రుణ పడి ఉంటా.- బచ్చల నర్సమ్మ, బెండాలపాడు
20 ఏండ్లుగా తాటాకు పాకలోనే..
ఇరవై ఏండ్లుగా తాటాకు పాకలోనే ఉంటున్నా. గాలివాన వస్తే మా కష్టాలు ఆ వాన దేవుడికే ముట్టేవి. పెద్ద వర్షం వస్తే ఓ మూలకు కూర్చునేవాళ్లం, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇల్లు వస్తదో.. రాదో.. అనుకున్న.. నాకు ఇల్లు వచ్చింది.
- బానోత్ దస్మా, బెండాలపాడు
ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తోంది..
పైసా ఖర్చు లేకుండా మా లాంటి పేదోళ్లకు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తోంది. సొంతిల్లు కట్టుకుంటుంటే నాకైతే మస్తు సంతోషంగా ఉంది. మేం ఇద్దరం కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నం. చిన్నపాటి తడికల ఇంట్లో చాలా కష్టాలు పడ్తున్నం. ఈ ఇల్లు పూర్తయితే మేం కూడా బిల్డింగ్‌లో ఉంటాం. ధారావత్ సంధ్య, బెండాలపాడు