అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. అయితే, ఉద్రిక్తతలు తగ్గే సూచనలు ఇంకా కనిపించడం లేదు. మొదట ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, క్షిపణి వ్యవస్థలపై లక్ష్యంగా చేసిన దాడిగా మొదలైన ఈ చర్య అనంతరం విస్తృత ప్రాంతీయ ఘర్షణగా మారింది.
ప్రారంభ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా పలువురు సీనియర్ సైనికాధికారులు మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి ప్రతిగా టెహ్రాన్ వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. అప్పటినుంచి మధ్యప్రాచ్య ప్రాంతంలో క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, వైమానిక దాడులు పెరుగుతున్నాయి. ఈ ఘర్షణ దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
యుద్ధంలో ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కొనే బదులు టెహ్రాన్ తన సైనిక వ్యవస్థను విస్తృతంగా విభజించి ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంచేవిధంగా నిర్మించింది. ప్రారంభ దాడులు జరిగినప్పటికీ తిరిగి ప్రతిస్పందించగల సామర్థ్యాన్ని ఈ నిర్మాణం కల్పిస్తుంది. ఈ వ్యూహంలో మొదటి కీలక అంశం అసమాన యుద్ధం. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల అధునాతన సాంకేతిక సైనిక వ్యవస్థలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ఖరీదైన ఆయుధ పోటీలోకి వెళ్లకుండా వేరే మార్గాన్ని ఎంచుకుంది.
తక్కువ ఖర్చుతో భారీసంఖ్యలో తయారుచేయగల డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించడం ద్వారా అత్యాధునిక రక్షణ వ్యవస్థలను అధిగమించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఉదాహరణకు ‘షాహెద్-136’ అనే ఆత్మాహుతి డ్రోన్ ధర సుమారు 20 వేల నుంచి 50 వేల డాలర్ల మధ్య ఉండగా, అలాంటి డ్రోన్లను అడ్డుకునే పేట్రియట్ క్షిపణి ఒక్కదానికి దాదాపు 4 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ భారీ వ్యయ వ్యత్యాసమే ఇరాన్ అసమాన యుద్ధ వ్యూహానికి మూలాధారం.
మిస్సైల్ నగరాలు
యుద్ధ వ్యూహాన్ని బలోపేతం చేసే మరో అంశం ఇరాన్ నిర్మించిన భూగర్భ ‘మిస్సైల్ నగరాలు’. పర్వతాల లోపల భారీ సొరంగ మార్గాలతో నిర్మించిన ఈ సదుపాయాల్లో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, ఇంధన నిల్వలు, ప్రయోగ వేదికలు నిల్వ ఉంచింది. గట్టి కాంక్రీటుతో బలపరిచిన ఈ నిర్మాణాలు నిరంతర వైమానిక దాడులు జరిగినా కూడా ప్రతీకార దాడుల సామర్థ్యాన్ని నిలబెట్టుకునేలా రూపొందించారు. వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ రహస్య కేంద్రాల వల్ల ఒకే దాడిలో ఇరాన్ మొత్తం క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేయడం చాలా కష్టం.
ఇరాన్ వ్యూహంలో మరో ముఖ్యమైన అంశం ప్రాంతీయ మిత్ర బలగాల నెట్‌వర్క్. దీనిని సాధారణంగా ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ అని పిలుస్తారు. మధ్యప్రాచ్యంలో హెజ్బొల్లా, హౌతీలు వంటి సాయుధ గుంపులతో ఏర్పరచుకున్న మైత్రి ద్వారా ఇరాన్ తన ప్రభావాన్ని తన సరిహద్దులకతీతంగా విస్తరించగలుగుతోంది. ఈ నెట్‌వర్క్ ద్వారా అనేక దిశల నుంచి దాడులు జరగడం సాధ్యమవుతుంది. ఈ వ్యూహాలన్నీ మోసాయిక్ డిఫెన్స్‌కు సంబంధించినవైనా, ఫార్వర్డ్ డిఫెన్స్ వ్యూహం ఇరాన్ ప్రభావాన్ని బయటి ప్రాంతాలకు విస్తరించడంపై దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా ‘షాడో వార్’ అనే సముద్ర వ్యూహాలను కూడా ఉపయోగిస్తోంది.
ప్రపంచంపై ప్రభావం
ఈ కీలక సముద్ర మార్గంలో ఏర్పడే అంతరాయాల ఆర్థిక ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. భద్రతా ఆందోళనల కారణంగా వందలాది చమురు ట్యాంకర్లు, సరుకు నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు దీనికి వెంటనే ప్రతిస్పందించాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు సుమారు 69 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర కేవలం రెండు వారాల్లోనే 104 డాలర్లకు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు కూడా సుమారు 10–15 శాతం వరకు పెరిగినట్లు అంచనాలు ఉన్నాయి.
ఇలాంటి ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతుంది. రవాణా ఖర్చులు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, తయారీ, ఎరువుల ఉత్పత్తి ఖర్చులు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. షిప్పింగ్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇప్పటికే పలు భౌగోళిక రాజకీయ సంక్షోభాల నుంచి కోలుకుంటున్న ప్రపంచ సరఫరా గొలుసులకు ఇది మరో భారంగా మారుతోంది.
భారీగా పెరిగిన రవాణా ఖర్చులు
కొన్ని నౌకలు ప్రత్యామ్నాయంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. అయితే ఈ మార్గం ద్వారా ప్రయాణం 10 నుంచి 25 రోజులు అదనంగా పడుతుంది. దీంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. అలాగే రెడ్ సీ ప్రాంతంలో హౌతీల దాడుల ప్రమాదం కూడా ఉంది. ఈ కారణంగా షిప్పింగ్ చార్జీలు ఇటీవల నెలలతో పోలిస్తే 3 నుంచి 5 రెట్లు పెరిగినట్లు అంచనాలు ఉన్నాయి. ఒక 20 అడుగుల కంటైనర్‌కు చెల్లించాల్సిన ధర కూడా గణనీయంగా పెరిగింది.
రెడ్ సీ, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఉన్న అధిక ప్రమాద పరిస్థితుల కారణంగా మెరైన్ కార్గో బీమా ప్రీమియాలు కూడా 15–30 శాతం వరకు పెరిగాయి. యుద్ధ ప్రమాద బీమా కోసం సరుకు విలువపై 0.10 – 0.15 శాతం అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరగడం, ఆహార ధరలు పెరగడం, ప్రభుత్వాల ఆర్థిక భారం పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల హార్మూజ్ జలసంధి స్థిరత్వం కేవలం ప్రాంతీయ భద్రతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ స్థిరత్వానికి కూడా కీలకం.
భారత్ పై ప్రభావం
ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశమైన భారత్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. దేశానికి అవసరమైన ముడి చమురులో 85 శాతం కంటే ఎక్కువ దిగుమతుల ద్వారానే వస్తోంది. వాటిలో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తోంది. భారతదేశం దిగుమతి చేసుకునే చమురులో సుమారు 50 నుంచి 60 శాతం హార్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. అందువల్ల ఈ మార్గంలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే భారతదేశ ఇంధన దిగుమతి బిల్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
విశ్లేషకుల అంచనాల ప్రకారం ప్రపంచ చమురు ధర ప్రతి 10 డాలర్లు పెరిగితే భారతదేశ వార్షిక దిగుమతి వ్యయం దాదాపు 10 నుంచి 15 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, ఇతర వస్తువుల ధరల రూపంలో కనిపిస్తుంది. భారత్ వినియోగించే ఎల్‌పీజీలో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారా వస్తోంది. వాటిలో దాదాపు 90 శాతం హార్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతున్నది. అంటే భారత ఎల్‌పీజీ సరఫరాలో సగ భాగం ఈ మార్గంపై ఆధారపడి ఉంది. లక్షలాది కుటుంబాలకు ఎల్‌పీజీ ప్రధాన వంట ఇంధనం కావడంతో ఇది అత్యంత కీలక అంశం.
ఇంధన వనరులను అభివృద్ధి చేయాలి
2026 ప్రారంభానికి భారత్‌లో 33 కోట్లకు పైగా గృహ ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 10 కోట్లకుపైగా కనెక్షన్లు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద ఉన్నాయి. సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర చర్యలు చేపట్టింది. రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లను దేశీయ అవసరాల కోసం ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. ఎల్‌పీజీ ఉత్పత్తిని సుమారు 25 శాతం పెంచినట్లు సమాచారం.
అదే సమయంలో పరిశ్రమల వినియోగాన్ని పరిమితం చేశారు. భారత్ వద్ద సుమారు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యూహా త్మక చమురు నిల్వలు ఉన్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న అదనపు నిల్వలు కూడా కొంత వరకు ఉపశమనం కలిగించగలవు. అయితే హార్మూజ్ ప్రాంతంలో సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఈ నిల్వలు కూడా సరిపోకపోవచ్చు.
ఇదే సమయంలో భారత వాణిజ్యంపై కూడా ప్రభావం పడుతోంది. బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, తాజా పండ్లు, కూరగాయలు, ఐ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో భారతదేశం దీర్ఘకాలిక భద్రత కోసం విభిన్న ఇంధన వనరులను అభివృద్ధి చేయడం, వ్యూహాత్మక నిల్వలను పెంచడం, పునరుత్పాదక ఇంధనాల్లో పెట్టుబడులు పెంచడం, సముద్ర దౌత్యాన్ని బలోపేతం చేయడం అవసరం.
ప్రపంచ వాణిజ్య మార్గాలపై ఒత్తిడి
నావికా మైన్లు, వేగవంతమైన దాడులు, వాణిజ్య నౌకలపై వేధింపులు వంటి చర్యలు ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్మూజ్ జలసంధి ప్రాంతంలో పెరుగుతున్నాయి. ఈ విధానాలు పూర్తిస్థాయి ప్రపంచ వాణిజ్య మార్గాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం కల్పిస్తాయి. హార్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే అత్యంత కీలక సముద్ర మార్గం. దాని అతి ఇరుకైన ప్రాంతం కేవలం సుమారు 39 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే.
అయినప్పటికీ ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతం, గణనీయమైన ఎల్‌ఎన్‌జీ ఎగుమతులు ప్రతిరోజూ ఈ మార్గం ద్వారానే సాగుతాయి. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రధాన ఇంధన ఎగుమతి దేశాలు తమ సరఫరాలను ప్రపంచ మార్కెట్లకు చేరవేయడానికి ఈ మార్గంపైనే ఆధారపడుతున్నాయి.
డా. రాధ రఘురామపాత్రుని
ట్రేడ్ అండ్ జియో పొలిటికల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
