ఇంటికి కూతవేటు దూరంలోనే ప్రభుత్వ పాఠశాల ఉంది. అయినా సరే.. తల్లిదండ్రులు అటువైపు చూడటం లేదు. తమ పిల్లల భవిష్యత్తు కోసం.. ఏ ప్రైవేటు స్కూల్లో చదివించాలి అని ఆలోచిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. లక్షలు కుమ్మరించైనా సరే.. ప్రైవేటు, కార్పొరేట్లోనే చదివించాలనే ధోరణి తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుపోయింది. అదే భావన సర్కారు స్కూళ్లను నిరాదరణకు గురి చేసింది. కాలక్రమంగా ఇది సామాజిక సమస్యగా మారింది.
తెలంగాణలో దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వీటిలో దాదాపు 1800 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లున్నాయి. ఇక్కడే 11 వేల ప్రైవేటు పాఠశాలలున్నాయి. వాటిలో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే ప్రభుత్వ స్కూళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అక్కడ చదువుకునే పిల్లల్లేరు. తక్కువగా ఉన్న ప్రైవేటు స్కూళ్ల వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు పరుగులు తీస్తున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ అంకెలు ప్రభుత్వ విద్యపై ప్రజల్లో తగ్గిన నమ్మకానికి సంకేతం. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన, అన్ని అర్హతలున్న టీచర్లున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఈ సమస్య ఒక్క బోధన ప్రమాణాలకు సంబంధించిందైతే కాదు. తల్లిదండ్రులు చూసే కోణం వేరేలా ఉందని అర్థమవుతుంది.
అసలు స్కూల్ వాతావరణం ఎలా ఉంది.. పిల్లలపై టీచర్ల పర్యవేక్షణ ఉందా.. ట్రాన్స్పోర్ట్ సదుపాయముందా? పాఠశాల నిర్వహణ ఎలా ఉంది? ఇంగ్లిష్ లో మాట్లాడుతున్నారా? ఇవన్నీ కలబోసిన సమగ్ర విద్యా అనుభవాన్ని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అంటే.. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మారాలి. అంటే ఒక ప్రయోగం జరగాలి. అదే ఆధునిక విద్యా వ్యవస్థకు అసలైన పరిష్కారం.
దేశానికి మార్గదర్శకంగా సంస్కరణలు
సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటినుంచి విద్యారంగం సమగ్ర రూపం మారిపోయింది. స్వయంగా ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉండటం.. రెండేండ్లలో పాఠశాల విద్యలో ఆయన తెచ్చిన సంస్కరణలు దేశానికే మార్గదర్శనం చేస్తున్నట్లుగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు స్కూళ్ల పర్యవేక్షణ గాలికి వదిలేశాయి. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి పదేండ్లు అయిదు నుంచి పది మండలాలకు ఒక్కరే ఇన్చార్జ్ ఎంఈవో ఉన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మండలానికో ఎంఈవోను నియమించి బడులపై పర్యవేక్షణను పెంచారు. ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేకంగా సీనియర్ టీచర్లతో కమిటీలు వేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెచ్చేందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు ఈ కమిషన్ ఇటీవలే పలు సూచనలు చేసింది. ఈలోపే సీఎం రేవంత్ రెడ్డి తన స్వీయ ఆలోచనతో చేపట్టిన కార్యక్రమాలు దేశమందరి దృష్టిని ఆకర్షించాయి.
వరుసగా గత రెండేండ్లు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజునే రెండు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయటం అందరినీ ఆకట్టుకుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఖాళీ కడుపులతోనే వస్తున్నారని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో పిల్లలకు అల్పాహారంతోపాటు పాలు అందించాలని నిర్ణయించారు.
వ్యాపారంగా ప్రైవేటు స్కూళ్లు
సర్కారు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు లేవు. తల్లిదండ్రులు కూడా పిల్లలను వెంటనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివించి.. ఇంగ్లిషులో మాట్లాడించాలని ఆరాటపడుతున్నారు. తల్లిదండ్రుల ఆరాటాన్ని ప్రైవేటు స్కూళ్లు వ్యాపారంగా మలుచుకున్నాయి. ఇంటర్, డిగ్రీ ఫీజులకు మించి ప్లే స్కూల్, నర్సరీలో చేర్పించేందుకు లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ సర్కారు స్కూళ్లలోనే ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఈ ఏడాదిలోనే ప్రారంభించింది.
అంగన్వాడీలను కూడా ప్రైమరీ స్కూళ్లకు అనుసంధానం చేసి, రాష్ట్రంలో దాదాపు వెయ్యి స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు అందుబాటులోకి తెచ్చింది. ఇంతకాలం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం విడివిడిగా నిర్వహిస్తోంది. కుల, మతాలకు అతీతంగా ప్రతి నియోజకవర్గానికి 30 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే.. పిల్లల మధ్య ప్రతిభావంతమైన పోటీతోపాటు ఉజ్వల భవితకు ఉపయోగపడుతుందనేది సీఎం ఆలోచన అన్ని నియోజకవర్గాల్లో ఈ స్కూళ్ల నిర్మాణం మొదలైంది. ఈ స్కూళ్లు భవిష్యత్తులో తెలంగాణ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తాయనేది ప్రభుత్వ నమ్మకం.
మెగా డీఎస్సీ ద్వారా..10 వేలకుపైగా టీచర్ల నియామకం
ప్రభుత్వ పాఠశాలలను చదువు బడి కంటే.. నాణ్యమైన విద్య అందించే కేంద్రాలుగా మార్చాలనేది సీఎం ఆలోచన. ప్రైవేటు పాఠశాలలకు మించి నాణ్యమైన విద్యను ప్రభుత్వ వ్యవస్థలోనే అందించేలా చర్యలు చేపట్టాలనేది లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు అమలుచేసింది. మెగా డీఎస్సీ ద్వారా 10 వేలకుపైగా టీచర్లను నియమించింది. వేలాది మంది ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ఇచ్చి పాఠశాలల్లో బోధన వ్యవస్థను పటిష్టం చేసింది.
సర్కారు స్కూళ్లలో టీచర్లు రెగ్యులర్‌గా బడికి రారు అనే అపవాదు ఉంది. దీనిని తొలగించి సర్కారు బడులపై నమ్మకం పెంచేందుకు ఫేషియల్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును రియల్ టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. పాఠశాలల్లో చిన్న పనులు, మరమ్మతుల బాధ్యతలను అక్కడే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా 58 వేలకుపైగా పనులు ఈ కమిటీలతో చేయించింది.
డిజిటల్ విద్య బలోపేతం
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి వేలాది పాఠశాలల్లో ట్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్ పరికరాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తు అందించింది. విద్యార్థులు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకునేలా ఏఐ, డిజిటల్ లిటరసీని పాఠ్యాంశాల్లో ప్రవేశపెడుతోంది. టీచర్లు ఇంగ్లిషులో పాఠాలు బోధించేలా ప్రతినెలా వారికి శిక్షణను ఇప్పిస్తోంది. సామాజిక విద్యా ధోరణిని మార్చేందుకు ఒక పెద్ద లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ముందు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాల విద్యలో చేసిన సంస్కరణలన్నీ దేశమంతా ఆచరించాల్సిన అనుభవ పాఠాలుగా కనిపిస్తున్నాయి.‘తల్లిదండ్రులు నాణ్యమైన విద్యను ఆశిస్తున్నారు.
అటువంటి విద్యా విధానమే ప్రభుత్వం అందించాలి.’ అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఓ ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులతో తన ఆలోచనలు పంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రజల నమ్మకానికి కేంద్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ దిశగా చేపట్టిన చర్యలన్నీ సర్కారు స్కూళ్లకు పునర్వైభవం తెచ్చే సంస్కరణలుగానే ప్రశంసలు అందుకుంటున్నాయి.
కేజీ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్య
కొత్తగా మండలానికో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్పెప్ట్‌ను సీఎం ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లేదా.. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్‌ను తలదన్నేలా ఈ స్కూల్ ఉండబోతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభిస్తారు. కొన్ని సర్కారు స్కూళ్లలో పిల్లలుంటే టీచర్లు లేరు. టీచర్లున్న చోట పిల్లల్లేరు.. ఇక్కడ అలాంటివన్నిటికీ చెక్ పెడతారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ప్రతి 30 మంది పిల్లలకో టీచర్ ఉంటారు. సమీప స్కూళ్ల పిల్లలందరినీ ఇక్కడికి చేర్చి.. కేజీ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్య బోధిస్తారు. సబ్జెక్టుల వారీగా స్కూల్లో దాదాపు 30 మంది టీచర్లుంటారు.
పిల్లలకు ఉదయం పాలు, అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం ఉంటుంది. ప్రతిరోజు ఇంటినుంచి వారిని పాఠశాలలకు తీసుకెళ్లి, ఇంటికి చేరవేసే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా ఆధునిక తరగతి గదులు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉంటాయి.
- బొల్గం శ్రీనివాస్
సీఎం పీఆర్ఓ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
