
హైదరాబాద్: భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని నిలుపాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామని తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ , హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్ , టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబి సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్, సింగర్ రోహిత్‌ని సీఎం రేవంత్ సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సినిమా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్, భగవంత్ కేసరి, నిర్మాత గారపాటి సాహుతో పాటు ఇతరులు పాల్గొన్నారు.