కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

కల్వకుంట్ల కుటుంబం  రాష్ట్రాన్ని దోచుకుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్కరికీ రేషన్ కార్డు ఇయ్యలే
  •     త్వరలో మహిళలకు నెలకు రూ.2,500 స్కీమ్ అమలు చేస్తం
  •     మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని వెల్లడి
  •     మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మెదక్/రామాయంపేట/నర్సాపూర్, వెలుగు: ప్రజలు చందాలేసుకుని తెలంగాణ కోసం ఉద్యమిస్తే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని మెదక్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్​చార్జి, మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకుని, సొంత ఆస్తులు, పార్టీ ఆస్తులు పెంచుకున్నారని ధ్వజమెత్తారు. అలాగే, ధనిక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రూ. 800 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని.. అందులో రూ.400 కోట్లు మేఘా కృష్ణారెడ్డి ఎలక్ట్రోరల్​ బాండ్ల రూపంలో ఇచ్చారని పేర్కొన్నారు. కవిత చేస్తున్న ఆరోపణలన్నీ నిజాలు కాబట్టే తిప్పికొట్టడం లేదన్నారు. బుధవారం మెదక్, రామాయంపేట, నర్సాపూర్ లో కాంగ్రెస్​ మున్సిపల్ అభ్యర్థులతో మంత్రి భేటీ అయి.. ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  మహిళలకు ఫ్రీ బస్ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 9 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. త్వరలో అర్హులందరికీ పెన్షన్ లు కూడా మంజూరవుతాయన్నారు. పేదలకు సన్న బియ్యం కోసం 13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ ద్వారా 23 వేల కోట్లు సర్కారు మంజూరు చేసిందని, వడ్డీలేని రుణాలు ఇచ్చిందని గుర్తు చేశారు. 

త్వరలో మహిళలకు నెలకు 2,500

మహిళలకు త్వరలో నెలకు రూ.2,500 ఇచ్చే స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి వివేక్ చెప్పారు. ఎన్నికలపై సీఎం రివ్యూ చేశారని, రాష్ట్రంలో 80 శాతం కౌన్సిలర్ స్థానాలలో కాంగ్రెస్ గెలవబోతున్నదని చెప్పారు. మెదక్ మున్సిపాలిటీలో 29 స్థానాలు (90 శాతం) గెలవబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. పనులు జరగాలంటే కాంగ్రెస్ ను గెలించాలని ప్రజలకు వివరించాలన్నారు.మెదక్ కు అదనంగ మరో 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇక్కడ మైనంపల్లి హన్మంతరావు ఉన్నాడు కాబట్టి.. మాజీ మంత్రి హరీశ్​ రావ్ ఎక్కువ దృష్టి పెడతారన్నారు. 

బీఆర్ఎస్​ పాలనలో మెదక్, దుబ్బాక నియోజకవర్గాలపై నిర్లక్ష్యం

బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు మెదక్, దుబ్బాక నియోజకవర్గాలను హరీశ్​రావు నిర్లక్ష్యం చేశారని మంత్రి వివేక్ ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గానికి రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్లు చేసుకున్నారని.. మేఘా ప్రాజెక్టులు అక్కడే మంజూరు చేయించుకున్నారని, మెదక్ నుంచి ఆఫీస్ లను తరలించారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన హరీశ్ ను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో 2,3,6,7 వార్డులలో మంత్రి ప్రచారం నిర్వహించారు. డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయడంతోపాటు అదనంగా 500 ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. పట్టణంలో అభివృద్ధి పనులకు రూ.45 కోట్లు మంజూరు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ సెగ్మెంట్ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, మైనార్టీ నాయకులు ఖురేషి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చందరపాల్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.