దేశాన్ని ట్రంప్ పాలిస్తున్నారా?.. అమెరికాకు మోదీ లొంగిపోయారు: ఎంపీ వంశీకృష్ణ

దేశాన్ని ట్రంప్ పాలిస్తున్నారా?.. అమెరికాకు మోదీ లొంగిపోయారు: ఎంపీ వంశీకృష్ణ
  •     ప్రధాని నిర్ణయాలతో దేశ ప్రజలపై రూ.3 లక్షల కోట్ల భారం
  •     మేకిన్ ఇండియా స్టోరీ అంతా ఉత్తదేనని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: భారత ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ నడిపిస్తున్నారా? లేక వాషింగ్టన్ డీసీ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలిస్తున్నారా? అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  ప్రశ్నించారు. ట్రంప్ కు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపించారు.  బుధవారం పార్లమెంట్ ఆవరణలో వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము బీజేపీకి  లేదన్నారు. అందుకే పార్లమెంట్ లో మైక్ కట్ చేసి గొంతు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు.

 ట్రంప్– మోదీ నిర్ణయాలతో దేశ ప్రజలపై దాదాపు రూ. 3 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు. అమెరికా టారిఫ్ లతో దాదాపు లక్ష కోట్లు, రష్యా నుంచి  ఆయిల్ ఇంపోర్ట్​ వ్యవహారంలో మరో లక్ష కోట్ల భారం పడుతుందన్నారు. ఇప్పటివరకు మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకున్నారని, ఆ స్టోరీ మొత్తం ఉత్తదే అని ఇప్పుడు తేలిందని విమర్శించారు. యూఎస్ నుంచి ఇండియాకు వచ్చే వస్తువులపై సుంకాన్ని మోదీ ఎత్తివేశారని చెప్పారు. ఆ పన్నులన్నీ దేశ ప్రజలపై మోపుతారని వివరించారు. అమెరికా– భారత్ ట్రేడ్ డీల్ పై బీజేపీ నేతలు చెబుతున్న దానికి, జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు.