- జనగామ జిల్లా శామీర్‌పేటలో సీసీ కెమెరాకు చిక్కిన టైగర్
- ఆలేరు మండలం శారాజీపేటలో లేగదూడపై దాడి
యాదాద్రి/జనగామ, వెలుగు : యాదాద్రి, జనగామ జిల్లావాసులను పెద్దపులి భయాందోళనకు గురి చేస్తోంది. రెండు రోజుల కిందటి వరకు యాదాద్రి జిల్లాలో సంచరించిన పులి సిద్దిపేట జిల్లా మీదుగా జనగామ జిల్లాలోకి అడుగుపెట్టింది. అక్కడి మళ్లీ యాదాద్రి జిల్లాలోకి చేరిన పులి ఆలేరు మండలం శారాజీపేటలో ఓ లేగదూడపై దాడి చేసింది. గత నెల 17 నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజపేట మండలాల్లో తిరిగింది. అదే నెల 31న రాత్రి గంధమల్ల ఇందిరానగర్ పరిధిలోని ఓ లేగదూడపై దాడి చేసిన అనంతరం యాదాద్రి-, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని దౌలాపూర్ ఫారెస్ట్‌లోకి చేరింది.
మళ్లీ ఈ నెల 2న రాజాపేట మండలంలోకి వచ్చిన పులి బసంతాపురంలో లేగదూడపై దాడి చేసి చంపేసింది. అనంతరం వివిధ గ్రామాల మీదుగా ఆలేరు మండలం శ్రీనివాసపురం-, జనగామ జిల్లా సిద్దెంకిలో వ్యవసాయ భూముల పక్కనే ఉన్న గుట్టపైకి చేరిందని పులి పాదముద్రల ద్వారా గుర్తించారు. పులిని ఎలాగైనా పట్టుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రాప్ కెమెరాలతో పాటు మూడు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. కానీ వాటికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న పులి జనగామ జిల్లా శామీర్‌పేటలోని కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం వద్ద సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
అక్కడి నుంచి పెంబర్తి మీదుగా మళ్లీ యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు, శారాజీపేటకు చేరుకొని దూడల శ్రీధర్‌కు చెందిన ఓ ఆవుపై దాడి చేసింది. అక్కడి నుంచి గొలనుకొండ వరకు కనిపించిన పెద్దపులి పాదముద్రలు ఆ తర్వాత కన్పించలేదు. పులి గొలనుకొండ శివారులోని పెద్దగుట్టపైకి చేరిందా ? లేదంటే మరో చోటుకు వెళ్లిందా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు మనుషులపై దాడిచేయకున్నా.. పులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పులి కదలికలపై థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లతో నిఘా
హైదరాబాద్, వెలుగు : యాదాద్రి, జనగామ జిల్లాలో సంచరిస్తున్న పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలతో పాటు థర్మల్ డ్రోన్లతో నిఘా పెట్టామని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి (పీసీసీఎఫ్ హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) డాక్టర్ సి.సువర్ణ పేర్కొన్నారు. పులి అడుగుజాడలు తెలుసుకునేందుకు బుధవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) వినయ్‌కుమార్, సీసీఎఫ్ క్షితిజ, వైల్డ్ లైఫ్ ఓఎస్డీ శంకరన్, డీసీఎఫ్ ఆంజనేయులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు.
పులి రక్షణతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ సువర్ణ మాట్లాడుతూ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అటవీ సిబ్బందికి సహకరించాలని, పులికి ఆపద రానివ్వొద్దని సూచించారు. కాగా, పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు స్టేట్ లెవల్‌లో స్పెషల్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్టీసీఏ సభ్యురాలు హరిణి వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ తరఫున రమేశ్, హైదరాబాద్ కన్సర్వేషన్ సొసైటీ నుంచి ఇమ్రాన్ సిద్దిఖ్, పుణెకు చెందిన ఆర్ఈఎస్క్యూ టీమ్‌మెంబర్స్ ఉన్నారు.
