కొరియన్ లవ్ గేమ్కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలి

కొరియన్ లవ్ గేమ్కు  ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలి
  • 9వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్.. 
  • ఘజియాబాద్​లో దారుణం
  •     వ్యసనంగా మారిన ఆన్​లైన్  కొరియన్ లవ్ ​గేమ్
  •     కొన్నాళ్లుగా స్కూల్​కు డుమ్మా కొట్టి మరీ ఆట
  •     కట్టడి చేసేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం
  •     మనస్తాపంతో బిల్డింగ్​పైనుంచి దూకిన బాలికలు
  •     ‘సారీ పప్పా..’ అంటూ లేఖ రాసి అఘాయిత్యం

ఘజియాబాద్:  ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దంటూ తల్లిదండ్రులు కట్టడి చేయడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్​ రాష్ట్రం ఘజియాబాద్​లోని భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న దంపతులకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండాల్సి రావడంతో వారికి ఆన్​లైన్ గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. ఆ తర్వాత కొరియన్ లవ్ గేమ్​ వారికి వ్యసనంగా మారింది. ఇలా గేమ్స్ ఆడేందుకు తరచూ స్కూలుకు డుమ్మా కొట్టేవారు. పిల్లల తీరుతో విసిగిపోయిన పేరెంట్స్.. ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దని గట్టిగా హెచ్చరించారు. గేమ్స్ ఆడేందుకు వీలులేకుండా కట్టడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన బాలికలు ముగ్గురూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున తాము ఉంటున్న బిల్డింగ్ పైకెక్కి తొమ్మిదో అంతస్తు నుంచి దూకారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు.

‘సారీ పప్పా..’ అంటూ లేఖ

బాలికలు ముగ్గురూ కొరియా కల్చర్​పై విపరీతమైన అభిమానం పెంచుకున్నారని  తల్లిదండ్రులు చెబుతున్నారు. తమను తాము కొరియన్లుగా భావించుకున్నారు. ఆ పేర్లతోనే ఒకరినొకరు పిలుచుకునేవారు. మొబైల్ ఫోన్‌‌‌‌‌‌ వాడకుండా కట్టడి చేయడంతో ఒంటరితనం ఫీలై మానసికంగా కుంగిపోయారు. ఆపై ముగ్గురూ కలిసి తాము ఉంటున్న తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి దూకి చనిపోయారు. ఈ ఆత్మహత్యల వెనక ఆన్ లైన్ గేమ్ పాత్ర ఉందని తొలుత అనుమానించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ తర్వాత కొరియన్ లవ్ గేమ్ ప్రభావంతోనే ముగ్గురు బాలికలు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా, చనిపోయే ముందు ఆ బాలికలు తమ తండ్రిని ఉద్దేశంచి ఓ పేపర్ సారీ పప్పా.. మా డైరీని చూడండి. అందులో రాసినవన్నీ నిజమేనని లేఖ రాశారు.

అర్ధరాత్రి బాల్కనీ గోడపై కూర్చున్నారు..

బాలికలు ముగ్గురూ అర్ధరాత్రి పూట బాల్కనీ గోడపై కూర్చోవడం తాను చూశానని ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్​లో ఉండే ఓ యువకుడు చెప్పాడు. సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసేలోపే వారు దూకేశారని తెలిపాడు. తొలుత ఓ అమ్మాయి కిందకు దూకే ప్రయత్నం చేస్తే మిగతా ఇద్దరూ కాపాడే ప్రయత్నం చేసినట్లు కనిపించిందన్నాడు. కాగా, బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు ఉపయోగించిన మొబైల్ ఫోన్​ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించామని, ఆత్మహత్యలకు కారణం అందులో బయటపడవచ్చని అభిప్రాయపడ్డారు.