షట్.. ఎంత డబ్బా కొట్టిన పని కాలే: ఇండియా, యూఎస్ డీల్‎తో కుమిలిపోతున్న పాక్

షట్.. ఎంత డబ్బా కొట్టిన పని కాలే: ఇండియా, యూఎస్ డీల్‎తో కుమిలిపోతున్న పాక్

ఇస్లామాబాద్: అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న భారత్‎పై ట్రంప్ టారిఫ్ తగ్గించారు. దీంతో సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఈ విషయంలో పాకిస్తాన్ మాత్రం వెనకబడిందని, తమ దేశంపై ట్రంప్ 19% టారిఫ్ వసూలు చేస్తున్నాడని పాక్‎లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం, సైన్యంపై సొంత పౌరులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సీడీఎఫ్ అసిమ్ మునీర్ చేతకానితనమేనని వారు మండిపడుతున్నారు. 

‘నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్​ను పాకిస్తాన్ నామినేట్ చేసింది. మినరల్స్ బ్రీఫ్‌‌‌‌కేస్ బహుమతిగా ఇచ్చింది. ఇజ్రాయెల్ శాంతి సమితిలోనూ చేరింది. వీలైనప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తింది. అయినా ట్రంప్.. పాకిస్తాన్​పై 19% టారిఫ్ వసూలు చేస్తున్నారు. కానీ, భారత్ ఇప్పటిదాకా ట్రంప్​ను ప్రశంసించలేదు. నోబెల్ పీస్ ప్రైజ్‌‌‌‌కు నామినేట్ చేయలేదు. రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని ఆదేశించినా పట్టించుకోలేదు. 

అయినా ట్రంప్.. ఇప్పుడు భారత్‎కే సపోర్ట్ చేస్తున్నారు. భారత్​పై పాక్ కంటే 1% తక్కువే టారిఫ్ అమలు చేయాలని నిర్ణయించారు. మంచి ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకున్నారు" అని పాక్ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ రాజకీయ నేతలు కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ట్రంప్​ను కలుస్తారని.. వారికి దేశ ప్రయోజనాలతో పనిలేదని మండిపడుతున్నారు. 

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలినా దేశాన్ని పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడీఎఫ్ అసిమ్ మునీర్‌‌‌‌ను ట్రంప్ సీక్రేట్ లవర్​లా మాత్రమే చూస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మునీర్‌‌‌‌కు షూ పాలిష్ లేయర్స్ అప్లై చేసే అవకాశం తప్ప ట్రంప్ ఏమీ ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులు, హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌లు ట్రెండ్ అవుతున్నాయి.