రెమ్యూనరేషన్లు, కలెక్షన్లు కావాలి.. కానీ, నచ్చకపోతే నోరు మెదపకూడదా.. ఇండస్ట్రీపై బండి సరోజ్ సంచలన పోస్ట్!

రెమ్యూనరేషన్లు, కలెక్షన్లు కావాలి.. కానీ, నచ్చకపోతే నోరు మెదపకూడదా.. ఇండస్ట్రీపై బండి సరోజ్ సంచలన పోస్ట్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతున్న‘‘రివ్యూ మాఫియా చర్చలు, డిఫామేషన్ కేసులు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై’’ యాక్టర్–డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇటీవలే మోగ్లీ సినిమాలో విలన్గా మెప్పించిన ఈ పబ్లిక్ స్టార్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

పెయిడ్ రివ్యూలు రాసే కొంతమంది జర్నలిస్టులపై విమర్శలు చేసిన ఆయన, “కవర్లు తీసుకుని రివ్యూలు రాసే అమ్ముడుపోయిన జర్నలిస్టులను పబ్లిక్ ఎప్పుడో పక్కన పెట్టింది. వారి రివ్యూలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఇంటర్వ్యూలకు కూడా వ్యూస్ రావడం లేదు” అని సరోజ్ వ్యాఖ్యానించారు.

అలాగే, టికెట్ రేట్ల అంశంపైనా బండి సరోజ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ జీవోల వల్ల టికెట్ రేట్లు పెరగడం సినిమా థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేస్తోందని, ఇలానే కొనసాగితే ఇది మొత్తం సినిమా పరిశ్రమకే నష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

“టికెట్ ధరలపై నియంత్రణ తీసుకొస్తే థియేటర్లకు ఫుట్‌ఫాల్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఒకవైపు భారీ రెమ్యూనరేషన్లు కావాలి, మరోవైపు భారీ కలెక్షన్లు కావాలి, మళ్లీ ఎవ్వరూ నోరు మెదపకూడదు అనడం సరైంది కాదు” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

బండి సరోజ్ ట్వీట్ చేస్తూ..‘‘ కవర్లు తీసుకొని పెయిడ్ రివ్యూలు రాసే కొంత మంది అమ్ముడుపోయిన జర్నలిస్టులను పబ్లిక్ ఎప్పుడో వెలివేసింది. వీళ్ల రివ్యూలను పక్కన పెట్టండి, ఇంటర్వ్యూలకి కూడా వ్యూస్ రావు. నిన్న మొన్న వచ్చిన పోడ్‌కాస్ట్ కుర్రాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే, వాళ్లు నిజంగా సినిమాపై చర్చ చేస్తున్నారు కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారు. అలాగే యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చే ఇండిపెండెంట్ రివ్యూయర్స్ లో నిజాయతీ లేదని పబ్లిక్ భావిస్తే, వాళ్ళే పక్కనపెడతారు.

ఆర్టికల్ 19 ప్రకారం.. ప్రతిఒక్కరు  అభిప్రాయ స్వేచ్ఛ ఉంది. దాని పైన PIL వేసి పోరాడండి. లేదా రివ్యూ నచ్చకపోతే డైరెక్ట్ గా ఫైట్ చెయ్యండి. అంతే కానీ ఈ కేసులు పెట్టి వాళ్ళ గొంతుకి మరింత బలం ఇవ్వడం తప్ప ఒరిగేదేమీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా టికెట్ ధరలపై నియంత్రణ తీసుకొస్తే థియేటర్లకు ఫుట్‌ఫాల్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. రెమ్యూనరేషన్లూ కావాలి, కలెక్షనూ కావాలి. మళ్ళీ ఎవ్వడూ నోరు మెదపకూడదు” అంటూ బండి సరోజ్ తనదైన ట్వీట్తో ముగించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న వివాదాలపై.. ఇపుడు సరోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.