ఫ్యామిలీ, లవ్, యాక్షన్… ఇలా ఏ జోనర్‌లో అయినా సినిమాలు చేస్తూ అభిమానుల్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు హీరో రాజశేఖర్. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఆయన, కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ఆవేశంతో కూడిన పాత్రల్లో నటించి ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’గా ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఇప్పటికీ రాజశేఖర్ సినిమాలు చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉంటారు. చాలా కాలంగా ఆయన సోలో హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చారు. విలన్ రోల్స్ లేదా ఇతర కీలక పాత్రలు చేయడం తనకు ఇష్టం లేదని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
కానీ ఇటీవల ఆ అభిప్రాయాన్ని పక్కనపెట్టినట్లు కనిపిస్తోంది. సరైన హిట్ లేకపోవడంతో రాజశేఖర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, రాజశేఖర్ కొత్త తరహా పాత్రలకు సిద్ధమయ్యారనే సంకేతం మాత్రం ఇచ్చింది.
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే స్పోర్ట్స్ డ్రామా చిత్రం “బైకర్”. ఈ సినిమాతో రాజశేఖర్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రాజశేఖర్ గ్లింప్స్ వైరల్
శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బైకర్’. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాజశేఖర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం రాజశేఖర్ పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక గ్లింప్స్ వీడియో విడుదల చేసింది. ఇందులో రాజశేఖర్ “బుల్లెట్ సునీల్” అనే మాజీ మోటోక్రాస్ రేసర్‌గా కనిపించారు.
వీడియోలో తన పాత్రను పరిచయం చేస్తూ..“మాజీ మోటోక్రాస్ రేసర్. అప్పట్లో నన్ను బుల్లెట్ సునీల్ అనేవారు. 18 ఇండియన్ ఛాంపియన్‌షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కు పైగా రేసులు గెలిచాను” అని చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ గ్లింప్స్ విడుదలైన వెంటనే వైరల్‌గా మారింది. యాంగ్రీ యంగ్‌మ్యాన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా విశేషాలు
బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.
