
హైదరాబాద్: అమీర్ పేట్, మైత్రి వనం పరిసర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం నాడు పర్యటించారు. మైత్రి వనం దగ్గర వరద ఉధృతిని కట్టడి చేయడానికి ఉన్న అవకాశాలను ఆయన పరిశీలించారు. ట్రంక్ లైన్ ఏర్పాటుతో పాటు తాత్కాలిక ఉపశమనానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై హైడ్రా కసరత్తు చేసింది. అమీర్ పేట్, మైత్రి వనం పరిసరాల్లో వరద కాలువలకు ఉన్న ఆటంకాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
జూబ్లీ హిల్స్, వెంకటగిరి, రహ్మత్ నగర్, యూసఫ్ గూడ, ప్రాంతాల నుంచి కృష్ణ కాంత్ పార్క్ మీదుగా పారే కాలువను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. పై నుంచి వచ్చే వరదను కృష్ణ కాంత్ పార్క్లో ఉన్న చెరువులోకి మళ్లిస్తే.. వరద ఉధృతిని కొంత కట్టడి చేయొచ్చని హైడ్రా కమిషనర్ అభిప్రాయపడ్డారు. సారధి స్టూడియో నుంచి మధురా నగర్ మీదుగా వచ్చే వరద సమస్యను పరిష్కరిస్తే ఇబ్బందులు ఉండవని అధికారుల ద్వారా హైడ్రా కమిషనర్ తెలుసుకున్నారు.
ఆగస్ట్ 4న కురిసిన కుండపోత వానకు అమీర్‌మీట్ మెట్రో ప్రాంతం వరద నీటితో నిండిపోయిన సంగతి తెలిసిందే. మైత్రీవనం దగ్గర భారీగా వరద చేరడంతో మెట్రో స్టేషన్ కింద నడుం వరకు నీళ్లు వచ్చాయి. స్వర్ణ జయంతి కాంప్లెక్స్దగ్గర కూడా భారీగా నీళ్లు నిలవడంతో వాహనాలు కదల్లేదు. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ ప్రాంతాలతో పాటు మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డుపై నీరు నిలిచిందని అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇప్పటికే వివరించారు.
Also read:-కూకట్పల్లిలో పది మీటర్ల నాలా మూడు మీటర్లు అయ్యింది.. ఆక్రమణలు తొలగించిన హైడ్రా
40 అడుగుల వెడల్పుతో పై నుంచి వచ్చిన వరద కాలువలు అమీర్ పేట, ఎస్ఆర్ నగర్ మెయిన్‌రోడ్డు దాటే సమయంలో 10 అడుగులకు కుంచించుకుపోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద నిర్మించిన కల్వర్టులో ఉన్న పైపు లైన్లలో ఒకటి పూడికతో మూసుకుపోవడంతో సమస్య తీవ్రమైందన్నారు.