హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువారం ( ఫిబ్రవరి 26 ) జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యమైన పుష్పసుగంధాలతో, భక్తి పారవశ్య వాతావరణంలో పుష్పయాగ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. నిత్యకైంకర్యాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తులవల్ల తెలియకుండానే ఏవైనా లోపాలు సంభవించి ఉంటే, వాటి నివృత్తి కోసం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలో ఉదయం 5.00 గంటల నుండి 6.30 గంటల వరకు యాగశాలలో వేదపండితులు వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి దివ్య ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామివారిని శోభాయమానంగా అలంకరించారు.
మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరిగింది. 12 రకాల పుష్పాలు, 6 రకాల పవిత్ర ఆకులతో స్వామివారికి పుష్పసమర్పణలు నిర్వహించారు అర్చకులు. చామంతి, రోజా, గన్నేరు, సంపంగి, మల్లె, కనకాంబరం, తామర, కలువ, మాను సంపంగి తదితర పుష్పాలతో పాటు తులసి, దవనం, మరువం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను వినియోగించారు.
ఈ మహోత్సవం కోసం సుమారు 2 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా సమర్పించినట్లు తెలిపారు ఆలయ అధికారులు. బెంగళూరు నుండి ప్రత్యేకంగా పుష్పాలు తెప్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఎల్.ఏ.సీ చైర్మన్ శ్రీ ఏ.వి.రెడ్డి, ఏఈవో శ్రీ రమేశ్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నిరంజన్ కుమార్, శ్రీ హరి తదితర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
