ఆకలినైనా భరిస్తాం.. కానీ అవమానాన్ని భరించం: సీఎం రేవంత్ రెడ్డి

ఆకలినైనా భరిస్తాం.. కానీ అవమానాన్ని భరించం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ సమాజం ఆకలినైనా భరిస్తుంది కానీ అవమానాన్ని మాత్రం భరిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమ న్యాయం కోసం ఈ ప్రాంతం కొట్లాడిందని.. ఈ పోరాటంలో వేలాది మంది నేలకొరిగారన్నారు. పోరాడి నేలకొరిగిన వీరుల స్ఫూర్తిగా ఉద్యోగులు బాధ్యలు చేపట్టాలన్నారు. గురువారం (ఫిబ్రవరి 26) హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గ్రూప్–I, గ్రూప్–II అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‎గా పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని తెలిపారు. ప్రశ్నాపత్రాలను జీరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 

ఉద్యోగాలు అమ్ముకున్నామని మా ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపికపై కోర్టుకు కూడా వెళ్లారని.. కోర్టులో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించి అభ్యర్థుల పక్షాన నిలబడిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పటికీ తప్పు చేయదని చెప్పారు. 

ఇక, ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరాలంటే ఉద్యోగులే కీలకమన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో మూడు రకాల పరిస్థితులు ఎదురవుతాయని.. ఒకటి గరం.. రెండు నరం.. మూడు భేషరమని చెప్పారు. మీరు మొదటి పరిస్థితి దగ్గరే ఆగిపోతే బాగుంటుదన్నారు. గరం, నరం, భేషరం అనే నానుడి తప్పు అని మీరు నిరూపించాలని సూచించారు. 

ఎలాంటి అప్రోచ్‎తో ఉద్యోగంలో చేరారో రిటైర్మెంట్ అయ్యే వరకు అలాగే ఉండాలన్నారు. మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ప్రభుత్వానికి మంచి పేరు అని అన్నారు. ఎంసీహెచ్ఆర్డీ, హార్వర్డ్ మధ్య ఒప్పందం జరగబోతుందని.. హార్వర్డ్‎ను హైదరాబాద్ తీసుకొస్తున్నామని తెలిపారు. 43 రోజుల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. 

4 కోట్ల మందికి సేవ చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయమే లక్ష్యంగా, జీవితాశయంగా శ్రమించారు. లక్షలాది మందిలో ఎంపికయ్యారంటే మీరు మెరికల్లాంటి వాళ్లని ప్రశంసించారు.