
Sensex Rally: కొత్త వారాన్ని నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా ప్రారంభించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూలతలతో పాటు గ్లోబల్ టెన్షన్స్ తగ్గుముఖం పట్టడమే ఈక్విటీ మార్కెట్ల పనితీరుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు ఈ పరిణామాలను గమనిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉదయం 10.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1035 పాయింట్ల లాభంతో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పెరుగుదలను నమోదు చేసింది.
అయితే మార్కెట్లు ఒక్కసారిగా పెరగటానికి కీలక కారణాలను పరిశీలిస్తే..
* ముందుగా అమెరికాకు చెందిన ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పి గ్లోబల్ భారతదేశానికి అందించే రేటింగ్ పెంచటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. భారత ఆర్థిక వ్యవస్థపై స్థిరమైన దృక్పథాన్ని కలిగి ఉండటంతో ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్స్ పెద్దగా ఉండబోదనే సానుకూల సంకేతాలు మార్కె్ట్లలో ఇన్వెస్టర్లను ముందుకు నడిపిస్తున్నాయి.
* ఇక మార్కెట్లలో సంతోషాన్ని నింపి బుల్స్ ర్యాలీని కొనసాగించేలా చేస్తున్న మరో కీలకమైన అంశం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణల గురించి కీలక ప్రకటన చేయటం. ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్ రేట్లకు బదులుగా.. రెండు స్లాబ్స్ ఉంటాయని ప్రకటించటం కొత్త జోష్ నింపుతోంది. అయితే దీని వెనుక పనులు దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్నట్లు కేంద్రం స్పష్టం చేయటం ప్రజలకు పెద్ద ఊరటను అందించనుందని తెలుస్తోంది. దాదాపు 99 శాతం వస్తువులు 12 శాతం జీఎస్టీ నుంచి 5 శాతం స్లాబ్ రేటుకు రావొచ్చని నిపుణులు అంచనావేయటం మార్కెట్ల బలమైన ప్రారంభానికి కారణంగా ఉంది.
* ఇక ఆగస్టు 15న ట్రంప్-పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందాన్ని తీసుకురానప్పటికీ గతంలో కంటే పురోగతి కనిపించిందని వర్గాలు చెప్పాయి. ఈ క్రమంలోనే సోమవారం అంటే ఆగస్టు 18న ట్రంప్ జెలెన్స్కీ యుద్ధంపై మరోసారి చర్చించటానికి కలవనుండటం సానుకూల పరిణామాలకు దారితీయవచ్చని తెలుస్తోంది.
ALSO READ : ఖర్చులను లెక్కగట్టేందుకు..స్మార్ట్ అసిస్టెంట్గా AI
* ఇక రష్యాతో చర్చల తర్వాత ట్రంప్ కీలకమైన కామెంట్స్ చేస్తూ భారతదేశంపై విధించిన సెకండరీ టారిఫ్స్ 25 శాతం గురించి పునఃపరిశీలించే ఆలోచనలో ఉన్నట్లు చేసిన సానుకూల కామెంట్స్ భారత స్టాక్ మార్కెట్లలో బుల్ ర్యాలీని ప్రేరేపించిందని నిపుణులు చెబుతున్నారు.
పైన పేర్కొన్న అంశాలు ప్రధానంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ ర్యాలీకి ఆజ్యం పోస్తున్నాయి. దీంతో మార్కెట్లు ప్రారంభమైన 5 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.5 లక్షల కోట్ల మేర పెరుగుదలను నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్ఠంగా 1100 పాయింట్ల ర్యాలీని చూడటంతో పెట్టుబడిదారుల సంపద భారీగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెప్పాయి. వాస్తవానికి గందరగోళంగా అనిశ్చితితో కొనసాగుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లకు ఇదొక శుభసూచికంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.