పుతిన్‎ మెడలు వంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపే దమ్ము ట్రంప్‎కు ఉంది: జెలెన్ స్కీ

పుతిన్‎ మెడలు వంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపే దమ్ము ట్రంప్‎కు ఉంది: జెలెన్ స్కీ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎తో భేటీకి ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పే శక్తి ట్రంప్‎కు ఉందని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి  ట్రంప్‎తో చర్చించడానికి జెలెన్ స్కీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ‘‘బలం ద్వారానే రష్యాను శాంతిలోకి నెట్టవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ బలం ఉంది’’ అని ఎక్స్‎లో ట్వీట్ చేశారు జెలెన్ స్కీ. 

ఇక అమెరికాలో ల్యాండ్ అయిన జెలెన్ స్కీ వాషింగ్టన్‌లో ఉక్రెయిన్-రష్యాకు అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి కీత్ కెల్లాగ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ శాంతి, ప్రజల భద్రత కోసం పనిచేయడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ట్రంప్, యూరోపియన్ నాయకులతో వాషింగ్టన్ సమావేశాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఒక ముఖ్యమైన దశగా అభివర్ణించారు జెలెన్ స్కీ. 

ఉక్రెయిన్‌లో శాంతి అంటే మొత్తం యూరప్‌కు శాంతి అని ఆయన పేర్కొన్నారు. రష్యా ఒత్తిడి ద్వారా మాత్రమే శాంతి మార్గంలోకి వస్తుందన్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్, జెలెన్ స్కీకి భేటీకి కొన్ని గంటల ముందు ఉక్రెయిన్‎లోని ప్రధాన నగరాల్లో రష్యా దాడులు చేసింది. రష్యా దాడులో కనీసం 10 మరణించారు. రష్యా దాడులను జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యా దాడుల్లో ఇద్దరు పిల్లలు మరణించడంతో సహా, పలువురు పౌరుల గాయపడటం బాధకరమన్నారు.