ఇరాన్ సుప్రీం లీడర్ ని అంతం చేసిన 'బ్లూ స్పారో'.. ఇజ్రాయెల్ వాడిన ఈ క్షిపణి స్పెషాలిటీ ఏంటంటే ?

ఇరాన్ సుప్రీం లీడర్ ని  అంతం చేసిన 'బ్లూ స్పారో'.. ఇజ్రాయెల్ వాడిన ఈ క్షిపణి స్పెషాలిటీ ఏంటంటే ?

ఇరాన్ సుప్రీం లీడర్  అయతుల్లా అలీ ఖమేనీని ఫిబ్రవరి 28, 2026న  ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేసిన  రహస్య దాడిలో మరణించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇందుకు ఇజ్రాయెల్ బ్లూ స్పారో అని పిలిచే అధునాతన జెట్-లాంచ్డ్ బాలిస్టిక్ ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తుంది. అయితే అతని మరణం తరువాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగి, యుద్దానికి దారితీసాయి.  

బ్లూ స్పారో అంటే ఏమిటి?
బ్లూ స్పారో అనేది ఇజ్రాయెల్ తయారు చేసిన ఒక అత్యంత శక్తివంతమైన, తెలివైన క్షిపణి. దీనిని యుద్ధ విమానాల (F-15 వంటివి) నుండి ప్రయోగిస్తారు. దీనిని అంతరిక్షం నుండి వచ్చే క్షిపణి అని ఎందుకు అంటారంటే... ఇది ప్రయోగించిన తర్వాత నేరుగా లక్ష్యం వైపు వెళ్లకుండా, భూ వాతావరణం అంచు వరకు పైకి వెళ్తుంది. అక్కడి నుండి ఒక్కసారిగా కిందికి తిరిగి, ఊహించని వేగంతో లక్ష్యాన్ని ఢీకొడుతుంది. ఇది సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా ఢీకొట్టగలదు.

దీని ప్రత్యేకత ఏంటి అంటే :
సాధారణ క్షిపణులను రాడార్ల ద్వారా గుర్తించి అడ్డుకోవడం సాధ్యమవుతుంది. కానీ బ్లూ స్పారో అంతరిక్షం అంచు నుండి విపరీతమైన వేగంతో దూసుకురావడం వల్ల, శత్రువులకు దానిని ఆపే సమయం గానీ, అవకాశం గానీ దొరకదు. బ్లూ స్పారో దాదాపు 6.5 మీటర్ల పొడవు, దాదాపు 1.9 టన్నుల బరువు ఉంటుంది.

దాడి ఎలా జరిగింది?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఇతర ముఖ్య నేతలు టెహ్రాన్‌లోని ఒక భవనంలో సమావేశమైన సమయంలో ఈ దాడి జరిగింది. ఉదయం  ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరి, సుమారు 30 క్షిపణులను ప్రయోగించాయి. అమెరికాకు చెందిన CIA, ఇజ్రాయెల్ మొస్సాద్ సంస్థలు కొన్ని నెలల నుండే ఖమేనీ కదలికలను గమనించాయి. ఆయన ఎప్పుడు, ఎక్కడ సమావేశం అవుతారో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాయి.

దాడికి ముందు ఇజ్రాయెల్ ఒక తెలివైన పని చేసింది. తమ సైనిక అధికారులు సెలవులో ఉన్నారని, అందరూ ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారని నమ్మించేలా కొన్ని ఫోటోలను విడుదల చేసి ఇరాన్‌ను తప్పుదారి పట్టించింది. ఈ దాడి సమయంలో అక్కడి ప్రాంతంలోని సెల్ ఫోన్ టవర్లను ఇజ్రాయెల్ జామ్ చేసింది. దీనివల్ల అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి ఒకరికొకరు సమాచారం అందించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు, ఆ దేశానికి చెందిన సుమారు 40 మంది కీలక సైనిక, రాజకీయ నాయకులు మరణించారు. దింతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసి.. యుద్ధవాతావరణం మొదలయింది.