స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ 'పర్ఫెక్ట్ లవర్ బాయ్' అని నిరూపించుకున్నారు. అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి జంట ఈ రోజు (మార్చి 6, 2026) తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని బన్నీ తన అర్ధాంగికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
తొలిచూపులోనే ప్రేమ..
వీరి ప్రేమకథ ఏ సినిమా కథకూ తీసిపోదు. అమెరికాలో చదువు ముగించుకుని వచ్చిన స్నేహను ఒక స్నేహితుడి వివాహంలో చూసిన బన్నీ, తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. మొదట్లో ఇరు కుటుంబాల్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, తమ ప్రేమపై ఉన్న నమ్మకంతో పెద్దలను ఒప్పించి మార్చి 6, 2011న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2014లో కుమారుడు అయాన్, 2016లో కుమార్తె అర్హ పుట్టింది.
వైరల్‌గా మారిన యానివర్సరీ పోస్ట్
తమ 15 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఒక అందమైన ఫోటోను షేర్ చేశారు. "హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. నువ్వు లేకపోతే నా ఈ సుదీర్ఘ ప్రయాణం ఇలా ఉండేది కాదు" అంటూ తన కృతజ్ఞతను చాటుకున్నారు. స్నేహ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "15 ఏళ్ల మధుర జ్ఞాపకాలు, ఇద్దరు పిల్లలు, మన ముద్దుపాపలు (పప్పీస్).. మన ప్రపంచం ఎంతో అందంగా ఉంది" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Happy Anniversary, Cutie .
— Allu Arjun (@alluarjun) March 6, 2026
15 years of togetherness.
The journey could not have been this without you 🖤 pic.twitter.com/C9pWuC65wf
పుష్పరాజ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా..
గతేడాది 'పుష్ప 2: ది రూల్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన అల్లు అర్జున్, ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి అల్లు అర్జున్ 'AA22' మూవీ చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఏప్రిల్ 8న ,బన్నీ పుట్టినరోజు , అట్లీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ఫేమ్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు బన్నీ సిద్ధమవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చే బన్నీ.. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో స్నేహారెడ్డి తనకు అందించిన మద్దతు వెలకట్టలేనిదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ క్యూట్ కపుల్ ఇలాగే నూరేళ్లూ సంతోషంగా ఉండాలని అభిమానులు సోషల్ మీడియాలో భారీగా విషెస్ తెలుపుతున్నారు.
