తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో సారి వార్తల్లో నిలిచారు. గ్లామర్ నటనతో ఎంతటి అభిమానాన్ని సంపాదించుకున్నారో.. అదే స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను కూడా ఆమె ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్ గా హోలీవేడుకల్లో పాల్గొంది. అక్కడ జరిగిన ఒక సంఘటన ఆమెకు విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది.
హోలీ వేడుకల్లో ఏం జరిగింది?
ఇటీవల హైదరాబాద్ లో అనసూయ ఒక బహిరంగ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఆమె వేదికపై మైక్ పట్టుకుని మాట్లాడుతుండగా, కింద ఉన్న కొందరు ఆమెను "ఆంటీ.. ఆంటీ.." అంటూ గట్టిగా కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడమే కాకుండా, కొందరు నెటిజన్లు ఆ ఆకతాయిల కేకలను సమర్థిస్తూ, హేళన చేస్తూ ప్రత్యేకంగా రీల్స్ చేయడం అనసూయను తీవ్రంగా కలిచివేసింది. దీనిపై ఆమె త్రీవంగా స్పందించింది.
మహిళా వివక్షపై గళం
ఈ ట్రోల్స్‌పై అనసూయ తనదైన శైలిలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. వయసును బట్టి ఒక మహిళను హేళన చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇతరుల బాధలో వినోదాన్ని వెతికే వారిని చూస్తే జాలి వేస్తోంది. వయసును సాకుగా చూపి మహిళలపై వివక్ష చూపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి వారిని చూసి సమాజం సిగ్గుపడాలి. మనకెందుకులే అని అందరూ మౌనంగా ఉంటే, ఇలాంటి అనాగరిక పనులు సమాజంలో సాధారణం అయిపోతాయి. అప్పుడు మనం మానవత్వాన్ని పూర్తిగా కోల్పోతాం అని ఆమె ఘాటుగా పోస్ట్ చేశారు.
ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్!
తాను ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని, ఎవరికీ భయపడనని ఆమె స్పష్టం చేశారు. నేను ఎన్నో కష్టాలను ఓర్చుకుని, విమర్శలను తట్టుకుని ఈ స్థాయికి వచ్చాను. నా ప్రయాణం, నా విజయాలు నాకు గర్వకారణం. కష్టపడి పైకి వచ్చే వారిని విమర్శించడానికి మీరెవరు? అంటూ ట్రోలర్స్ ను ఉద్దేశించి ఆమె మండిపడ్డారు.
గతంలోనూ ఇదే రగడ!
అనసూయను 'ఆంటీ' అని పిలవడం వల్ల వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో విజయ్ దేవరకొండ అభిమానులతో జరిగిన సోషల్ మీడియా యుద్ధంలో కూడా ఈ పదం పెద్ద దుమారాన్నే రేపింది. అప్పట్లో ఆమె తనను వ్యక్తిగతంగా దూషించిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అంతే కాకుండా ఇటీవల మహిళల వస్త్రాధారణపై ఘాటు స్పందించడం కూడా పెద్ద వివాదానికి కూడా దారితీసింది. ఏదేమైనా , అనసూయ పెట్టిన ఈ ఆంటీ వివాదం పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్ మారింది.
