ఢిల్లీ మోతీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

ఢిల్లీ మోతీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

న్యూఢిల్లీ: ఢిల్లీ మోతీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మంటల్లో సజీవ దహనమయ్యారు. మహాజన్‌ ఎలక్ట్రానిక్స్‌లో అకస్మాత్తుగా మంటలు రేగడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీం నలుగురిని రక్షించింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయంలో స్పష్టత లేదు. అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఢిల్లీలో గత నెలలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాద దుర్ఘటనే జరిగింది. ఢిల్లీలోని కరల్ బాగ్ ప్రాంతంలో విశాల్ మెగా మార్ట్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు పాతికేళ్ల ధీరేందర్ ప్రతాప్ లిఫ్ట్ లో చిక్కుకుని ఇదే ఘటనలో ఊపిరాడక చనిపోయాడు.