నీట్ పేపర్ లీకేజీ కేసులో.. కింగ్పిన్ ప్రొఫెసర్ కులకర్ణి అరెస్ట్.. పుణెలో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు

నీట్ పేపర్  లీకేజీ కేసులో.. కింగ్పిన్  ప్రొఫెసర్ కులకర్ణి అరెస్ట్.. పుణెలో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు
  • నీట్ నిర్వహణ ప్రక్రియలో ఎన్‌‌‌‌‌‌‌‌టీఏతో కలిసి పనిచేసిన నిందితుడు 
  • ఆ పరిచయాలతోనే అతని చేతుల్లోకి చేరిన నీట్ ప్రశ్నాపత్రాలు
  • పరీక్షకు ముందే విద్యార్థులను ఒకచోటికి చేర్చి ఆన్సర్లు అందజేత

న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రధాన సూత్రధారి(కింగ్‌‌పిన్)ని సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితుడిని కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణిగా అధికారులు గుర్తించారు. పుణెలోని నివాసంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నీట్ పరీక్ష నిర్వహణ ప్రక్రియలో ఎన్‌‌టీఏతో కలిసి కులకర్ణి పనిచేశారని వివరించారు. ఆ పరిచయాలతోనే అతనికి ప్రశ్నపత్రాలు సులభంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అయితే, దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా నిందితుడి గురించిన మరిన్ని వివరాలను వెల్లడించడానికి ఏజెన్సీ నిరాకరించింది.

  • ప్రశ్నలను విద్యార్థులకు ఎలా చేరవేశాడంటే..

సిబీఐ అధికారుల ప్రకారం.. 2026 ఏప్రిల్ చివరి వారంలో కులకర్ణి.. మరో నిందితురాలు మనీషా వాఘ్మారే సహాయంతో నీట్ కు అప్లై చేసిన విద్యార్థులను ఒక గ్రూప్‌‌గా చేసి ఒకచోటికి చేర్చాడు. అనంతరం పుణెలోని తన నివాసంలో ఆ విద్యార్థులకు ప్రత్యేకంగా కోచింగ్ క్లాసెస్ నిర్వహించాడు. ఈ స్పెషల్ క్లాసుల టైంలోనే కులకర్ణి ప్రశ్నలతో పాటు ఆప్షన్లు, సరైన సమాధానాలను విద్యార్థులకు నోటితో చెప్పి (డిక్టేట్) రాయించాడు. ఆయన చెప్పిన వివరాలను విద్యార్థులు తమ నోట్‌‌బుక్‌‌లలో రాసుకోగా.. ఆ నోట్స్‌‌లోని అంశాలు, నీట్-యూజీ 2026 అసలు ప్రశ్నపత్రంతో  మ్యాచ్ అయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. 

  • తుది దశకు చేరిన దర్యాప్తు

మే 7న రాజస్తాన్‌‌లో మొదటగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేంద్ర విద్యా శాఖ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా మే 12న సీబీఐ కేసు నమోదు చేసి, విచారణ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో  సోదాలు నిర్వహించి, అనేక కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు నిందితులు, మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్నారు. 

వారి మొబైల్ ఫోన్ల కాల్ డేటా రికార్డ్స్ (సీడీఆర్) పరిశీలించారు. పరీక్షకు ముందు రోజుల్లో, పరీక్ష రోజున వారు ఎవరెవరితో ఎక్కువగా ఫోన్లలో మాట్లాడారు? అనే జాబితాను తీశారు. అలా లింకులను వెతుకుంటూ వెళ్లినప్పుడు పుణెలో ఉన్న కులకర్ణి నెంబర్, అతనితో జరిపిన సంభాషణలు బయటపడ్డాయి. కాగా..మే 14 నాటికి జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి మొత్తం ఏడుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. 

వీరిలో ఐదుగురు నిందితులను ఇప్పటికే కోర్టులో ప్రవేశపెట్టి, సమగ్ర విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. గురువారం అరెస్ట్ అయిన మిగిలిన ఇద్దరు నిందితులను ఢిల్లీకి తరలించేందుకు (ట్రాన్సిట్ రిమాండ్ కోసం) పుణె కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో కెమిస్ట్రీ పేపర్ లీకేజీకి గల అసలు మూలాలతో పాటు, ప్రత్యేక కోచింగ్ తరగతులకు విద్యార్థులను ఒక్కచోటుకు చేర్చిన మధ్యవర్తుల వివరాలు కూడా లభ్యమయ్యాయి. ఈ కేసులో సమగ్రమైన, నిష్పక్షపాతమైన దర్యాప్తు జరపడానికి సీబీఐ కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు.