లోక్​సభ ఎన్నికల తర్వాత ఆరు రాష్ట్రాల్లో ఆగమాగం

లోక్​సభ ఎన్నికల తర్వాత ఆరు రాష్ట్రాల్లో ఆగమాగం

కేంద్రంలో రెండోసారి నరేంద్ర మోడీ సర్కార్​​ ఏర్పాటైన రెండు వారాలు గడుస్తున్నా అపోజిషన్​ పార్టీల పొజిషన్​ ప్రశ్నార్థకంగానే ఉంది. లోక్​సభ ఫలితాల ఎఫెక్ట్​తో చాలా చోట్ల పొలిటిక్​ సీన్​ పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్ష శిబిరం పరస్పర నిందారోపణల్లో  మునిగిపోయింది. ఉత్తరప్రదేశ్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్​ ఢిల్లీలో పార్టీలు ఆత్మరక్షణలో పడిపోయాయి. లోక్​సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థులుగా ఫోకస్​అయిన రాహుల్​ గాంధీ(కాంగ్రెస్​), మమతా బెనర్జీ(టీఎంసీ), మాయావతి(బీఎస్పీ), చంద్రబాబు(టీడీపీ) ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. 2014తో పోల్చుకుంటే 2019 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​, బీఎస్పీ కాస్త మెరుగుపడ్డా రాహుల్​, మాయల ‘ప్రధాని’ కలలు మాత్రం కల్లలుగానే మిగిలిపోయాయి. ఆంధ్రప్రదేశ్​లో వైఎస్​ జగన్‌​ నేతృత్వంలోని వైఎస్సార్​సీపీ దెబ్బకు టీడీపీ, చంద్రబాబు కుదేలైపోయారు. బెంగాల్​లో మరో రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మమతా బెనర్జీకి బీజేపీ పెద్ద చాలెంజ్​లు విసురుతున్నది. ఆరు నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ఆమ్​ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్​ కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. లోక్​సభ ఓటమికి మీరే బాధ్యులంటూ ఆ రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

ఉత్తరప్రదేశ్​…

లోక్​సభ ఎన్నికల్లో మహాకూటమిగా పోటీచేసి విఫలమైన బీఎస్పీ, ఎస్పీ, ఆర్​ఎల్డీ పార్టీలు  రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించాయి. బీజేపీని ఓడించే అవకాశాన్ని ఎస్పీ జారవిడిచిందని, కనీసం యాదవుల బేస్​ ఓట్లు కూడా రాబట్టలేకపోయిందంటూ మాయావతి నిందించారు. అదే స్థాయిలో స్పందించిన అఖిలేశ్​, అజిత్​సింగ్​లు సొంతదారిలో పోతామని చెప్పారు. సిట్టింగ్​ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికకావడంతో యూపీలోని 11 అసెంబ్లీ సెగ్మెంట్లు ఖాళీ అయ్యాయి. ఆ  స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కలిసికట్టుగా బీజేపీని ఓడించలేకపోయిన ఈ మూడు పార్టీలు విడివిడిగా ఆ పని ఎలా చేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మహారాష్ట్ర…

పార్టీ వైఫల్యానికి తోడు నాయకుల మధ్య కుమ్ములాటతో మహారాష్ట్రలో కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. లోక్​సభ ఎన్నికలకు ముందు అధిష్టానం సంజయ్​ నిరుపమ్​ను తప్పించి మిళింద్​ దేవరాకు ముంబై కాంగ్రెస్​ చీఫ్​ పదవి అప్పగించినా ఫలితం మారలేదు. రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు బ్లేమ్​గేమ్​తో కాలం వెళ్లదీస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు​ రాధాకృష్ణ విఖే, అబ్దుల్ సత్తార్​ కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిమరీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంకో పది, పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా కాషాయతీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​(1) కంటే ఎన్సీపీకే(4) ఎక్కువ సీట్లొచ్చాయి. ఈ ఎఫెక్ట్​తో​ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

హర్యానా…

ఇక్కడ బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్​లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి. మాజీ సీఎం భూపీందర్​ సింగ్​ హుడా, ప్రస్తుత స్టేట్​ కాంగ్రెస్​ చీఫ్​ అశోక్​ తన్వర్​ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి. విభేదాల్ని పరిష్కరించడానికి ఏఐసీసీ దూతగా సీనియర్​ నేత గులాంనబీ ఆజాద్​ రంగంలోకి దిగినా పరిస్థితి​ కంట్రోల్​లోకి రాలేదు. ఆజాద్​ ముందే రెండు వర్గాలు వాదులాటకు దిగాయి. కొద్దిరోజుల కిందట జరిగిన రాజీ భేటీలో సహనం కోల్పోయిన అశోక్​ తన్వార్​.. ‘నన్ను కాల్చిపారేయండి..’ అంటూ కోపంతో ఊగిపోయారు.

వెస్ట్​ బెంగాల్…​

బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న టీఎంసీ చీఫ్​, మమతా బెనర్జీ.. ఎన్నికల తర్వాత కూడా పొలిటిక్​ వార్​ కొనసాగిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్, ధన బలంతోనే బీజేపీకి సీట్లొచ్చాయని దీదీ ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరుతున్నారు. ప్రత్యర్థిపై ఎదురుదాడితోనే పార్టీని కాపాడుకోవాలనుకుంటున్న మమత ఆ క్రమంలో కొన్ని ఏరియాల్లోని బీజేపీ ఆఫీసుల్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా లోక్​సభ ఎన్నికల ఫలితాలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను గందరగోళంలోకి నెట్టేశాయి.

రాజస్థాన్​… 

కొడుకు నిలబడ్డ సీట్లో తప్ప మిగతా చోట్ల పార్టీకి ప్రచారం చేయలేదని ఆరోపణలు ఎదుర్కొన్న సీఎం అశోక్​ గెహ్లాట్​పై విమర్శలదాడి ఇంకా పెరిగింది. డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ కూడా గెహ్లాట్​ను టార్గెట్​ చేశారు. ఒక దశలో సచిన్​ కాంగ్రెస్​ను వీడతారని, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆయన్ని అనుసరిస్తారని, బీజేపీ సపోర్ట్​తో సీఎం పోస్ట్​ చేపడతారన్న వార్తలు కూడా వచ్చాయి.

 

కర్ణాటక…

28 లోక్​సభ స్థానాలకుగానూ 25 సీట్లు బీజేపీ గెల్చుకోవడంతో కర్ణాటకలో జేడీఎస్​–కాంగ్రెస్​ కూటమి సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ నేతలను కలుస్తుండటం, బీఎస్పీ, ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలూ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని సంకేతాలివ్వడం లాంటి పరిణామాలు లోక్​సభ ఎన్నికల తర్వాతే జరిగాయి. దేవేగౌడ ఆయన మనవడు నిఖిల్​ గౌడతోపాటు జేడీఎస్​ అభ్యర్థులు దారుణంగా ఓడిపోవడానికి కాంగ్రెసే కారణమని సీఎం కుమారస్వామి బాహాటంగా విమర్శించారు.