అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు: కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు: కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • 2028 నాటికి ప్రొడక్షన్​ ఆపేసిన గనులన్నీ క్లోజ్ చేస్తం: కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • ఒక్క ఏడాదిలోనే బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 
  • దిగుమతులు తగ్గించి రూ.60 వేల కోట్లు ఆదా చేశాం 
  • భూగర్భ గ్యాసిఫికేషన్‌‌‌‌‌‌‌‌పై రీసెర్చ్ కోసం రూ.46 వేల కోట్ల ప్రోత్సాహకాలు
  • పాడైన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఖనిజాలను వెలికితీసే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలను కోరినా స్పందించలేదని, 2028లో తాము అధికారంలోకి రాగానే ఈ హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. తన శాఖ పరిధిలో 12 ఏండ్లలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలపై సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. 

ప్రధాని మోదీ నాయకత్వంలో బొగ్గు రంగం విప్లవాత్మక మార్పులకు వేదికైందని చెప్పారు. ప్రతి వారం కోల్ ఉత్పత్తి, సరఫరాపై ప్రధాని మానిటరింగ్ చేస్తున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 189 మిలియన్ టన్నుల కోల్ స్టాక్ ఉందని తెలిపారు. గతంలో  చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేవాళ్లమని, దీనిని గణనీయంగా తగ్గిస్తున్నామని చెప్పారు. 

ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామని, ఫలితంగా బొగ్గు దిగుమతులు 4 శాతం తగ్గి, దేశానికి రూ. 60 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని వివరించారు.  రైల్వేలకు వచ్చే లాభాల్లో 51 శాతం కేవలం బొగ్గు రవాణా ద్వారానే అందుతోందని, విద్యుత్ ఉత్పత్తిలోనూ బొగ్గు పాత్ర 72 శాతంగా ఉందన్నారు.

సైంటిఫిక్ పద్ధతిలో గనుల మూసివేత 
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గనుల నుంచి బొగ్గు తీసి వదిలేయడమే తప్ప, వాటిని పూడ్చే పని జరగలేదని కిషన్‌‌‌‌రెడ్డి తెలిపారు. వదిలేసిన 147 పాత గనులను 2028 నాటికి సైంటిఫిక్ పద్ధతిలో మూసివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో గిన్నిస్ రికార్డు సాధించాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. దీని కోసం డబ్ల్యూసీఎల్‌‌‌‌లో ఒక మైన్‌‌‌‌ను తానే  దత్తత తీసుకున్నట్టు తెలిపారు. 

గనులు మూసివేసిన తర్వాత అక్కడ వాటర్ బాడీస్ లేదా సోలార్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.  బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసే కోల్ గ్యాసిఫికేషన్‌‌‌‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఇందుకోసం కేంద్రం రూ.46 వేల కోట్ల ఇన్సెంటివ్స్ ఇస్తోందని తెలిపారు.

ప్రధానంగా లోతుగా ఉన్న బొగ్గును వెలికితీసేందుకు  అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్‌‌‌‌పై రీసెర్చ్ చేస్తున్నామన్నారు. దీంతో ఫర్టిలైజర్స్, కెమికల్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు దేశంలోనే లభిస్తాయని, ఈనెల11న హైదరాబాద్‌‌‌‌లో దీనిపై రోడ్ షో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రైవేట్ కంపెనీలను పిలిచి కోల్ గ్యాసిఫికేషన్‌‌‌‌పై చర్చిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ప్రమాద బీమాను రూ.1.25 కోట్లకు పెంచామని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. 

నాడు బొగ్గు అంటే అవినీతి.. 
కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే అవినీతి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌గా ఉండేవని కిషన్‌‌‌‌రెడ్డి అన్నారు. అప్పట్లో అవినీతి కారణంగా  బొగ్గుమంత్రే జైలుకెళ్లారని పేర్కొన్నారు. సీతారాం కేసరి తెల్ల కాగితం పైన రాసిస్తే.. మన్మోహన్ సింగ్ బొగ్గు గనులను కేటాయించేవారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ బొగ్గురంగాన్ని పూర్తిగా సంస్కరించామన్నారు. పదేండ్లలో తీసుకున్న నిర్ణయాలతో అల్యూమినియం ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందన్నారు. స్టీల్ ఉత్పత్తిలోనూ దేశం రెండో స్థానంలో ఉన్నదని,  బైరైటిస్, మైకాలో కీలకంగా ఉన్నామని వివరించారు.

జింక్  ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నామని, లైమ్ స్టోన్ లోనూ 3వ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. మైనింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో.. క్రిటికల్ మినరల్స్‌‌‌‌లో మాత్రం చాలా వెనకబడి ఉన్నామని వివరించారు.  భవిష్యత్తు అవసరాల కోసం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ను రూ.32 వేల కోట్లతో ప్రారంభించామని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

ప్రస్తుతం మనం 93 శాతం ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నామని, దీన్ని తగ్గించేందుకు పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి, వాటి నుంచి ఖనిజాలను వెలికితీసే యోచనలో ఉన్నామని వివరించారు. ఇందుకోసం రూ.1,500 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు.