2047 నాటికి మానవరహిత వ్యవసాయం..ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి : అగ్రికల్చర్ వీసీ అల్దాస్ జానయ్య

2047 నాటికి మానవరహిత వ్యవసాయం..ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి : అగ్రికల్చర్ వీసీ అల్దాస్ జానయ్య
  • అగ్రివర్సిటీలో భారత్– ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌‌‌‌వర్క్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అగ్రికల్చర్​ వర్సిటీ  వీసీ ప్రొఫెసర్  అల్దాస్  జానయ్య పేర్కొన్నారు. గురువారం అగ్రికల్చర్​ వర్సిటీలో భారత్–ఆస్ట్రేలియా దేశాల వ్యవసాయ రంగ సహకారానికి  స్మార్ట్  ఫార్మ్  నెట్‌‌‌‌వర్క్ (ఐఏఎస్​ఎఫ్​ఎన్​) కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా వీసీ  జానయ్య మాట్లాడుతూ విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

ఆస్ట్రేలియా హైకమిషనర్  ఫిలిప్  గ్రీన్  మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్–ఆస్ట్రేలియా భాగస్వామ్యం కీలకమన్నారు. రైతులకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలు అందించడంలో ఇలాంటి భాగస్వామ్యాలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.  ఈ స్మార్ట్ ఫార్మ్ నెట్‌‌‌‌వర్క్  ద్వారా  వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్  అగ్రికల్చర్​ టెక్నాలజీ, ప్రెసిషన్  ఫార్మింగ్, స్థిర వ్యవసాయ విధానాలు, అగ్రికల్చర్​ ఇన్నొవేషన్​  రంగాల్లో భారత్–ఆస్ట్రేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ వేదిక ద్వారా రెండు దేశాలకు చెందిన విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌‌‌‌లు, పరిశ్రమలు, ఇతర భాగస్వామ్య సంస్థల మధ్య జాయింట్​ రిసర్చ్ లు, పైలట్ ప్రాజెక్టులు, టెక్నాలజీ  మార్పిడి, స్కిల్​ డెవలప్​మెంట్​ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పీజేటీఏయూ, ఆర్​ఐసీహెచ్, సీఎస్​యు, బీఈఎస్టీ, సీఓఈ-ఎఫ్‌‌‌‌పీఓ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.