సర్, ఓట్ల దోపిడీపై సీజేఐకి లేఖ రాస్తం.. ఇండియా కూటమి సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు

సర్, ఓట్ల దోపిడీపై సీజేఐకి లేఖ రాస్తం.. ఇండియా కూటమి సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి
  • ప్రతి రెండు నెలలకోసారి భేటీ కావాలని నిర్ణయం
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆగస్టు 8న కూటమి తదుపరి భేటీ
  • ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కేంద్రం ఆల్​ పార్టీ మీటింగ్​ పెట్టాలని డిమాండ్​
  • డీఎంకే, ఆప్ గైర్హాజరు.. భేటీకి హాజరైన 22 ప్రతిపక్ష పార్టీలు

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి సోమవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. కాన్​స్టిట్యూషన్ క్లబ్‌‌‌‌లో జరిగిన ఈ భేటీలో ఎన్నికల ప్రక్రియ, విద్యా రంగం, దేశ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ధరలు, రైతులు, నిరుద్యోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఐదు ప్రధాన నిర్ణయాలను ప్రకటించారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్), ఓట్ల దోపిడీ, ఎన్నికల ప్రక్రియపై ఉన్న అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే నీట్ పేపర్​లీక్, సీబీఎస్ఈ పేపర్​వాల్యుయేషన్​లో లోపాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది.

రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, సోనియా గాంధీ, తేజస్వీ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, డి.రాజా, జాన్ బ్రిట్టాస్ తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వర్చువల్‌‌‌‌గా హాజరయ్యారు. మొత్తం 22 ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా సమావేశానికి హాజరయ్యారు. 

దేశంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కూటమి డిమాండ్ చేసింది. ప్రజల సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై ఉమ్మడిగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది.

ఐదు కీలక నిర్ణయాలు ఇవే..!

  • సర్, ఓట్ల దోపిడీపై సీజేఐకి లేఖ: ఎస్ఐఆర్, ఓటర్ల హక్కుల ఉల్లంఘన, ‘ఓట్ల దోపిడీ’, ఎన్నికల అక్రమాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది.
  • ప్రధాన్ రాజీనామాకు డిమాండ్: నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ పేపర్ల వాల్యుయేషన్​లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
  • ఆల్​ పార్టీ మీటింగ్ ​పెట్టాలి: తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై చర్చించేందుకు కేంద్రం ఆల్​ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి.
  • రెండు నెలలకోసారి భేటీ: ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశమవ్వాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టు 8న హైదరాబాద్‌‌‌‌లో జరగనుంది.
  • పార్లమెంట్ వింటర్​ సమావేశాల్లో కోఆర్డినేషన్: రాబోయే వర్షాకాల సమావేశాల సమయంలో ప్రతిరోజూ ఉదయం ఖర్గే కార్యాలయంలో కూటమి ఎంపీలు సమావేశమై యాక్షన్​ప్లాన్​పై చర్చించాలని నిర్ణయించారు.

సమావేశానికి రాని టీవీకే
డీఎంకే, ఆప్​ ఈ సమావేశానికి హాజరు కాలేదు. తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే కూడా సమావేశంలో పాల్గొనలేదు. కూటమి ఏర్పాటులో భాగమైన పార్టీలకే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. సమావేశంలో పాల్గొన్న నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని ఖర్గే చెప్పారు.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎన్నికల పారదర్శకత, యువత భవిష్యత్తు, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం వంటిఅంశాలపై రానున్న రోజుల్లో సమన్వయంతో పోరాటం కొనసాగించాలని కూటమి నిర్ణయించింది.