న్యూఢిల్లీ: లడఖ్ లోని గోగ్రా–హాట్ స్ప్రింగ్స్ ఏరియాలో బార్డర్ కు ఇరువైపులా ఇండియా, చైనా బలగాల ఉపసంహరణ సోమవారం కల్లా పూర్తి కానుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య జులైలో జరిగిన 16వ రౌండ్ కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి గోగ్రా–హాట్ స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి రెండు దేశాల బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
బలగాల ఉపసంహరణ ప్రాసెస్ గురువారం ఉదయమే మొదలైందని, సోమవారం కల్లా పూర్తవుతుందని ఆయన చెప్పారు. బార్డర్ కు రెండు వైపులా ఏర్పాటు అయిన టెంపరరీ నిర్మాణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా తొలగించాలని, ఈ ప్రాసెస్ ను రెండు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా ధ్రువీకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎల్ఏసీ వెంబడి మిగతా ప్రాంతాల్లో ఉన్న వివాదాలను కూడా పరిష్కరించుకోవాలని, ఇందుకోసం చర్చలను కొనసాగించాలని కూడా అంగీకరించినట్లు పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం.. ఎల్‌ఏసీ యథాతథ స్థితికి ఇరు పక్షాలూ కట్టుబడి ఉండాలని, ఏకపక్షంగా మార్చకూడదని ఒప్పుకున్నట్లు వివరించారు. కాగా, ఉజ్బెకిస్తాన్లో ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీవో) సదస్సుకు ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తదితరులు హాజరుకానున్నారు. కీలకమైన ఈ సదస్సుకు కొద్దిరోజుల ముందు బార్డర్ వివాదంపై రెండు దేశాలూ సానుకూల నిర్ణయం తీసుకున్నాయి.
